
అల్జీరియా మెరుపులు
ప్రపంచకప్‌లో అల్జీరియా తమ నాకౌట్ ఆశలను నిలుపుకుంది. గ్రూప్ ‘హెచ్’లో భాగంగా ఆదివారం అర్ధరాత్రి కొరియా రిపబ్లిక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఆఫ్రికా జట్టు చెలరేగి 4-2 తేడాతోనెగ్గింది.
కొరియాపై 4-2తో విజయం
పోర్టో అలెగ్రే: ప్రపంచకప్‌లో అల్జీరియా తమ నాకౌట్ ఆశలను నిలుపుకుంది. గ్రూప్ ‘హెచ్’లో భాగంగా ఆదివారం అర్ధరాత్రి కొరియా రిపబ్లిక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఆఫ్రికా జట్టు చెలరేగి 4-2 తేడాతోనెగ్గింది. ప్రపంచకప్ చరిత్రలో ఓ ఆఫ్రికా జట్టు నాలుగు గోల్స్ చేయడం ఇదే ప్రథమం. అలాగే ఈ మెగా టోర్నీలో ఇప్పటిదాకా వరుసగా ఈ జట్టుకు ఏడు మ్యాచ్‌ల్లో ఎదురైన పరాజయాలకు బ్రేక్ పడినట్టయ్యింది. స్లిమాని, హలీచే, జబౌ, బ్రహిమి అల్జీరియా తరఫున గోల్స్ చేయగా సన్ హుయాంగ్ మిన్, కూ జాచియోల్ కొరియాకు గోల్స్ అందించారు. స్లిమాని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
• 26వ నిమిషంలో మెడ్జానీ ఇచ్చిన లాంగ్ పాస్‌ను స్లిమాని గోల్ చేసి అల్జీరియాకు ఆధిక్యాన్నిచ్చాడు.
• మరో రెండు నిమిషాల(28వ ని.)కే డిఫెండర్ రఫీక్ హలీచే 2-0 ఆధిక్యం అందించగా... 38వ నిమిషంలో జబౌ చేసిన గోల్‌తో అల్జీరియా ప్రథమార్ధాన్ని 3-0తో ముగించింది.
• 50వ నిమిషంలో కొరియా తరఫున హుయాంగ్ మిన్ గోల్ చేశాడు. కానీ 62వ నిమిషంలో ఆరు గజాల దూరం నుంచి బ్రహిమి(అల్జీరియా) గోల్ కీపర్ కాళ్ల మధ్యలో నుంచి బంతిని పంపి జట్టుకు తిరుగులేని ఆధిక్యాన్ని అందించాడు. మరో పది నిమిషాల (72వ ని.)కు కొరియాకు కూ జాచియోల్ రూపంలో ఓదార్పు గోల్ దక్కింది.