రాయుడు అవుటా... డౌటా?
మిర్పూర్: బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడే వన్డేలో టీమిండియా బ్యాట్స్ మన్ అంబటి రాయుడు వివాదస్పదరీతిలో అవుటయ్యాడు. కెప్టెన్ ధోనితో కలిసి భారీ స్కోరుకు బాటలు వేసిన రాయుడు అంపైర్ సందేహాస్పద నిర్ణయంతో పెవిలియన్ చేరాడు.
43.3 ఓవర్ లో మొర్తజా వేసిన బంతిని షార్ట్ ఫైన్ గా ఆడేందుకు రాయుడు ప్రయత్నించాడు. వికెట్లను వదిలి పక్కకు జరిగి బంతిని కొట్టే ప్రయత్నం చేశాడు. అయితే బంతి రాయుడు తొడ భాగం వద్ద తగిలి తర్వాత వికెట్ కీపర్ చేతిలో పడింది. బంగ్లా ఆటగాళ్లు గట్టిగా అప్పీలు చేయడంతో అంపైర్ అవుట్ ప్రకటించారు. అంపైర్ నిర్ణయంపై రాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మైదానం వీడాడు. మరో ఎండ్ లో ఉన్న కెప్టెన్ ధోని కూడా అంపైర్ వైపు ఆశ్చర్యంగా చూశాడు. అయితే బంతి రాయుడు ప్యాడ్లకు తగల్లేదని రీప్లేలో కనబడింది.
దీనిపై 'బంతి మిర్పూర్ లో, బ్యాట్ ఢాకాలో ఉంటే అంపైర్ అవుట్ ఇచ్చారు' కామెంటేటర్ ఒకరు వ్యాఖ్యానించారు. అంపైర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన రాయుడు తన మ్యాచ్ ఫీజులో కొంత వదులుకోవాల్సి రావచ్చు అంటూ చమత్కరించారు.