కెర్బర్... కష్టంగా!
♦ శ్రమించి నెగ్గిన టాప్ సీడ్
♦ ప్రిక్వార్టర్స్‌లో ముగురుజా, రద్వాన్‌స్కా
♦ వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ
లండన్: ‘నంబర్‌వన్’ ర్యాంక్‌ను నిలబెట్టుకునే క్రమంలో టాప్ సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) మరో అడుగు ముందుకేసింది. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ప్రపంచ 70వ ర్యాంకర్ షెల్బీ రోజర్స్ (అమెరికా)తో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో కెర్బర్ 2 గంటల 17 నిమిషాల్లో 4–6, 7–6 (7/2), 6–4తో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది.
తొలి సెట్‌ను కోల్పోయి, రెండో సెట్‌లో 2–4తో వెనుకబడిన కెర్బర్ ఆ తర్వాత పుంజుకుంది. స్కోరును సమం చేయడంతోపాటు సెట్‌ను టైబ్రేక్‌లో గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్‌లో కెర్బర్ తొలి గేమ్‌లోనే షెల్బీ సర్వీస్‌ను బ్రేక్ చేసింది. ఆ తర్వాత తన సర్వీస్‌లను నిలబెట్టుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో కెర్బర్ నాలుగు డబుల్ ఫాల్ట్‌లు, 14 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు షెల్బీ ఏకంగా 47 అనవసర తప్పిదాలు చేసింది.
ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో 14వ సీడ్ ముగురుజా (స్పెయిన్) 6–2, 6–2తో సొరానా కిర్‌స్టీ (రొమేనియా)పై, 9వ సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలాండ్) 3–6, 6–4, 6–1తో తిమియా బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్)పై, ఐదో సీడ్ కరోలైన్ వొజ్నియాకి (డెన్మార్క్) 3–6, 7–6 (7/3), 6–2తో కొంటావీట్ (ఎస్తోనియా)పై, ఏడో సీడ్ స్వెత్లానా కుజ్‌నెత్సోవా (రష్యా) 6–4, 6–0తో పొలోనా హెర్‌కాగ్ (స్లొవేనియా)పై గెలిచారు. మూడో రౌండ్‌లో నెగ్గిన 24వ సీడ్ కోకో వాండెవాగె (అమెరికా), అన్‌సీడెడ్స్ మగ్దలీనా రిబరికోవా (స్లొవేకియా), పెట్రా మార్టిక్ (క్రొయేషియా) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు.
జొకోవిచ్ జోరు...
పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ జొకోవిచ్ (సెర్బియా), ఆరో సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మూడో రౌండ్‌లో జొకోవిచ్ 6–4, 6–1, 7–6 (7/2)తో గుల్‌బైస్ (లాత్వియా)పై, రావ్‌నిచ్ 7–6 (7/3), 6–4, 7–5తో రామోస్ (స్పెయిన్)పై నెగ్గారు. పదో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), 11వ సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్), 15వ సీడ్ మోన్‌ఫిల్స్ (ఫ్రాన్స్), 13వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. అయితే 12వ సీడ్ సోంగా (ఫ్రాన్స్) 2–6, 6–3, 6–7 (5/7), 6–1, 5–7తో సామ్ క్వెరీ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు.
మూడో రౌండ్‌లో సానియా జంట
మహిళల డబుల్స్ రెండో రౌండ్‌లో సానియా మీర్జా (భారత్)–ఫ్లిప్‌కెన్స్ (బెల్జియం) ద్వయం 6–3, 3–6, 6–4తో నవోమి బ్రాడీ–హితెర్ వాట్సన్ (బ్రిటన్) జంటపై గెలిచి మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది. మిక్స్‌డ్ డబుల్స్ రెండో రౌండ్‌లో రోహన్ బోపన్న (భారత్)–గాబ్రియెలా దబ్రౌస్కీ (కెనడా) జోడీ 7–6 (7/2), 7–5తో మార్టిన్ (ఫ్రాన్స్)–ఒలారూ (రొమేనియా) జంటపై గెలిచింది.