
ఉత్కంఠపోరులో ఆసీస్ గెలుపు
జోహన్సెస్బర్గ్: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో ట్వంటీ 20 లో ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఇరు జట్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఆసీస్ చివరి బంతి వరకూ పోరాడి విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 205 పరుగుల లక్ష్యాన్ని విసిరింది. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ 32 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆరోన్ ఫించ్(2), వాట్సన్(9), స్టీవ్ స్మిత్(19)లు నిరాశపరిచారు. కాగా డేవిడ్ వార్నర్(77;40 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు), మ్యాక్స్వెల్(75; 43 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు)లు దూకుడుగా ఆడటంతో ఆసీస్ విజయం వైపు పరుగులు తీసింది.
ఈ జోడీ నాల్గో వికెట్ కు 161 పరుగులు నమోదు చేసింది. అయితే ఈ ఇద్దరూ ఒక పరుగు వ్యవధిలో పెవిలియన్ కు చేరడంతో ఆసీస్ 194 పరుగులకు ఐదు వికెట్లను నష్టపోయింది. దీంతో చివరి ఓవర్లలో ఆసీస్ విజయానికి 11 పరుగుల అవరమయ్యాయి. ఆ సమయంలో ఫాల్కనర్(7 నాటౌట్), మిచెల్ మార్ష్(2 నాటౌట్) అజేయంగా క్రీజ్లో నిలబడి ఆసీస్ కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్లో ఆసీస్ విజయంతో మూడు టీ 20ల సిరీస్ 1-1 తో సమం అయ్యింది. తొలి టీ 20లో దక్షిణాఫ్రికా గెలిచిన సంగతి తెలిసిందే.
అంతకుముందు దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 204 పరుగులు సాధించింది. ఓపెనర్ డీ కాక్ దూకుడుకు తోడు, కెప్టెన్ డు ప్లెసిస్ మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో సఫారీలు భారీ ఇన్నింగ్స్ నమోదు చేశారు. డీ కాక్ 28 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్తో ఇన్నింగ్స్ కు చక్కటి పునాది వేయగా, డు ప్లెసిస్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 79 పరుగులు సాధించాడు.
ఓపెనర్ ఏబీ డివిలియర్స్(13) తొలి వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరి నిరాశపరిచినా, డీకాక్, డుప్లెసిస్ జోడి ఇన్నింగ్స్ ను చక్కదిద్దింది. మంచి బంతులను సమర్ధవంతంగా ఎదుర్కొంటూనే చెత్త బంతులను బౌండరీలు దాటించింది. ఈ జోడీ 65 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన అనంతరం డీ కాక్ రెండో వికెట్ గా అవుటయ్యాడు.ఆపై గత మ్యాచ్ లో కీలక ఇన్నింగ్స్ ఆడిన డేవిడ్ మిల్లర్(33 ;18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి తనదైన శైలిలో ఆడి జట్టు భారీ స్కోరులో సహకరించాడు.