మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా కీలక ఆటగాడు, విధ్వంసక బ్యాట్స్‌మన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆశ్చర్యకర రీతిలో క్రికెట్‌కు నిరవధిక విరామం ప్రకటించాడు. మానసికపరమైన సమస్యలతో తాను బాధపడుతున్నట్లు, కొంత కాలం ఆటకు దూరం కావాలని భావిస్తున్నట్లు అతను తన నిర్ణయాన్ని వెలువరించాడు. క్రికెట్ ఆ స్ట్రేలియా (సీఏ) ఈ విషయాన్ని నిర్ధారిస్తూ అధికారిక ప్రకటన చేసింది. ‘ఆస్ట్రేలియా ఆటగాళ్ల మంచి చెడులు చూసుకోవడం మా బాధ్యత. మ్యాక్స్‌వెల్‌కు మా పూర్తి మద్దతు ఉంటుంది. క్రికెట్ ఆస్ట్రేలియా, అతని దేశవాళీ జట్టు విక్టోరియా కలిసి అతని ఆరోగ్యంపై తగిన శ్రద్ధ తీసుకుంటాయి.
మ్యాక్సీ మళ్లీ క్రికెట్‌లోకి అడుగు పెట్టే విధంగా తగిన వాతావరణం కల్పిస్తాం. ఈ సమయంలో మ్యాక్స్‌వెల్ వ్యక్తిగత జీవితాన్ని ఎవరూ ఇబ్బంది పెట్టరాదని మేం విజ్ఞప్తి చేస్తున్నాం. అతనో ప్రత్యేకమైన ఆటగాడు. ఆస్ట్రేలియా క్రికెట్ కుటుంబంలో భాగమైన గ్లెన్ తొందరగా తిరిగొస్తాడని ఆశిస్తున్నాం’ అని క్రికెట్ ఆస్ట్రేలియా ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ బెన్ ఒలీవర్ ప్రకటన జారీ చేశారు. గత కొంత కాలంగా మ్యాక్స్‌వెల్ మానసికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని, దీనిని సరైన సమయంలో గుర్తించిన అతనికి విరామం తప్పనిసరి అని టీమ్ సైకాలజిస్ట్ మైకేల్ లాయిడ్ వ్యాఖ్యానించారు.
ఆదివారం శ్రీలంకతో జరిగిన తొలి టి20లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ బరిలోకి దిగాడు. 28 బంతుల్లోనే 62 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో పాటు మైదానంలో కూడా చాలా చురుగ్గా కనిపించి ఒక అద్భుతమైన రనౌట్ కూడా చేశాడు. అతని ఉత్సాహాన్ని చూస్తే ఎవరికీ అతని మానసిక స్థితిపై కనీస సందేహం కూడా రాదు. కానీ నాలుగు రోజులు తిరిగే సరికి తాను క్రికెట్ ఆడలేనని, విరామం కోరుకుంటున్నట్లు చెప్పాడు. మానసికంగా తాను తీవ్రమైన ఆందోళన, ఒత్తిడికి గురవుతున్నట్లు 31 ఏళ్ల మ్యాక్స్‌వెల్ వెల్లడించడం అనూహ్యం.
ఏడాది కాలంగా...
అడిలైడ్‌లో జరిగిన తొలి టి20 మ్యాచ్‌కు ముందే తన విరామం గురించి కోచ్ లాంగర్‌తో మ్యాక్స్‌వెల్ చర్చించాడు. బ్రిస్బేన్‌లో జరిగిన రెండో టి20లో అతను బ్యాటింగ్ చేయలేదు. అయితే మ్యాక్సీ సమస్యల్లో ఉన్నట్లు తాను చాలా కాలం క్రితమే గుర్తించానని టీమ్ కోచ్ జస్టిన్ లాంగర్ వెల్లడించాడు. ‘నా పరిస్థితి అంత బాగా ఏమీ లేదు. ఆటను ఆస్వాదించలేకపోతున్నాను’ అని తనతో చెప్పినట్లు లాంగర్ స్పష్టం చేశాడు. శ్రీలంకతో సిరీస్ సమయంలో మ్యాచ్ ప్రసారకర్తలతో మ్యాక్స్‌వెల్ సరదాగా మాట్లాడటం కూడా ఒక ‘ముసుగు’ మాత్రమేనని కోచ్ అభిప్రాయ పడ్డాడు.
తమ ఆటతో ప్రజలకు ఎంతో వినోదం పంచినా...ఆటగాళ్ల అంతరంగాన్ని ఎవరూ గుర్తించలేరని లాంగర్ వ్యాఖ్యానించాడు. గత ఏడాది కాలంగా మ్యాక్స్‌వెల్ పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లు ఆడటంతో పాటు సుదీర్ఘ ప్రయాణాలు చేశాడు. స్వదేశంలో సిరీస్‌ల తర్వాత భారత్, యూఏఈ పర్యటన, ఆ తర్వాత ఇంగ్లండ్‌లో ప్రపంచ కప్, దానికి కొనసాగింపుగా కౌంటీల్లో కూడా అతను ఆడాడు. తాను ఎప్పుడు తిరిగి వస్తాననే విషయంలో మ్యాక్స్‌వెల్ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. ప్రస్తుతానికి అతని స్థానంలో ఆస్ట్రేలియా జట్టులో డి ఆర్సీ షార్ట్‌ను ఎంపిక చేశారు.
మనసంతా కలతే..!
మార్కస్ ట్రెస్కోథెక్, ఫ్లింటాఫ్, టెయిట్, హోగార్డ్, ట్రాట్, హార్మిసన్, మాడిసన్, హేల్స్, సారా టేలర్... ఒకరా, ఇద్దరా ఈ జాబితా చాలా పెద్దదే! ఎక్కడో ఒక చోట మ్యాచ్ లేదా సిరీస్ ఆడుతుంటారు. అకస్మాత్తుగా మనసులో ఏదో తెలియని నైరాశ్యం అలముకుంటుంది. ఆడింది చాలు, ఇక నా వల్ల కాదు అంటూ అకస్మాత్తుగా ఇంటికి వెళ్లిపోయేందుకు లేదా ఆటకు దూరమయ్యేందుకు సిద్ధపడిపోతారు. ఆ సమయంలో వారికి ఆటగాడిగా తమ ఘనతలు, కీర్తి కనకాదులు ఏవీ గుర్తుకు రావు. పైన చెప్పిన క్రికెటర్లంతా ఏదో ఒక దశలో మానసిక సమస్యలతో బాధపడినవారే.
వీరిలో కొందరు విరామం తర్వాత మళ్లీ కోలుకొని బరిలోకి దిగితే... మరికొందరు ఆట ముగించారు. ఇదే సమస్యతో దాదాపు నెల రోజుల క్రితం రిటైర్మెంట్ ప్రకటించిన మహిళా క్రికెటర్ సారా టేలర్ వయసు 30 ఏళ్లే అంటే ఆశ్చర్యం కలుగుతుంది. యాదృచ్ఛికమో, మరే కారణమో గానీ వీరిలో ఎ క్కువ మంది ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లే ఉన్నారు. ఆసీస్ కీలక ఆటగాడైన మ్యాక్స్‌వెల్ తాజా నిర్ణయంతో ఈ ‘మానసిక ఆందోళన’ సమస్య మళ్లీ చర్చను రేకెత్తిస్తోంది.
డబ్బుకు లోటుండదు, ఎక్కడకు వెళ్లినా దేవుడి స్థాయిలో నీరాజనాలు లభిస్తాయి. అలాంటి క్రికెటర్లకు కూడా మానసిక సమస్యలు, ఒత్తిడి ఉంటాయా అనేది సగటు అభిమానికి సహజంగానే వచ్చే సందేహం. అయితే సాధారణ రోగాలను, గాయాలను ఏదో ఒక పరీక్ష ద్వారా గుర్తించే తరహాలో మానసిక ఆందోళనను కొలిచే పరికరాలు లేవు. ఇది సదరు వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. అంతర్జాతీయ క్రికెటర్ కెరీర్ తీవ్ర ఒత్తిడితో కూడుకున్నదనేది వాస్తవం. సుదీర్ఘ కాలం దేశవాళీలో రాణించిన తర్వాత వచ్చే అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. దురదృష్టవశాత్తూ విఫలమైతే ఇక ఆట ముగిసిపోతుందనే ఆందోళన కూడా సహజం. ఎంతగా రాణించినా ఇంకా బాగా ఆడాలనే ఒత్తిడి, వారిపై అంచనాలు ఉంటాయి.
ఎంత వద్దనుకున్నా కొన్ని సందర్భాల్లో వాణిజ్యపరమైన అంశాలు కూడా ఆటగాళ్లను నడిపిస్తాయి. క్రికెటర్లు జట్టులో స్థిరపడిన తర్వాత కూడా ఇలాంటి మానసిక సమస్యలు ఎదుర్కొన్నారు. మ్యాక్స్‌వెల్ విషయంలో ఇలాంటి ఒత్తిడే పెరిగింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తన స్థాయికి తగినట్లుగా ఆడలేకపోతున్నానని, ఎంత బాగా ఆడినా టెస్టు జట్టులో స్థానం కోసం తనను పరిగణనలోకి తీసుకోవడం లేదనే నైరాశ్యం అతనిలో ఇటీవల బాగా కనిపించిందని మ్యాక్సీ సన్నిహితులు వెల్లడించారు.
టెస్టు జట్టులో స్థానం కోసమే 2019 ఐపీఎల్‌నుంచి తప్పుకొని దేశవాళీ క్రికెట్‌లో పడిన శ్రమను వారు గుర్తు చేశారు. ప్రస్తుత తరంలో చాలా మంది క్రికెటర్లు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని స్పోర్ట్స్ సైకాలజిస్ట్‌లు చెబుతున్నారు. వీరిలో కొందరు దీనిని సమర్థంగా ఎదుర్కొంటే, మరికొందరు ఒకసారి బయటపడితే తమ కెరీర్‌పై ఆ ముద్ర ప్రభావం చూపిస్తుందని, కెరీర్ ముగుస్తుందని భయపడుతుంటారని వారు అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ దేశాల్లో బోర్డునుంచి ఈ తరహా అంశాల్లో సహకారం లభిస్తుంది కాబట్టి వారే స్వేచ్ఛగా బయటపడతారనేది ఒక విశ్లేషణ.
110 వన్డేలు ఆడిన మ్యాక్స్‌వెల్ 32.32 సగటు, 123.37 స్ట్రైక్‌రేట్‌తో 2877 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 19 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 61 అంతర్జాతీయ టి20ల్లో 35.02 సగటుతో 1576 పరుగులు సాధించాడు. అతని స్ట్రైక్‌రేట్ ఏకంగా 160 ఉండటం విశేషం. ఈ రెండు ఫార్మాట్‌లలో కలిపి మ్యాక్స్‌వెల్ 76 వికెట్లు తీశాడు. అతను 7 టెస్టులు కూడా ఆడినా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment