యూకీ శుభారంభం | Australian Open: Yuki Bhambri through to second round in qualifying | Sakshi
Sakshi News home page

యూకీ శుభారంభం

Published Thu, Jan 12 2017 12:40 AM | Last Updated on Tue, Sep 5 2017 1:01 AM

యూకీ శుభారంభం

యూకీ శుభారంభం

 తొలి రౌండ్‌లోనే సాకేత్‌ ఓటమి  
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ


మెల్‌బోర్న్‌: టెన్నిస్‌ సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ క్వాలిఫయింగ్‌ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత మాజీ నంబర్‌వన్‌ యూకీ బాంబ్రీ రెండో రౌండ్‌లోకి ప్రవేశించగా... ప్రస్తుత భారత నంబర్‌వన్‌ సాకేత్‌ మైనేని మాత్రం తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ మొదటి రౌండ్‌ మ్యాచ్‌లో యూకీ 6–1, 6–4తో ఏడో సీడ్, ప్రపంచ 116వ ర్యాంకర్‌ స్టీఫెన్‌ కొజ్‌లోవ్‌ (అమెరికా)పై గెలుపొందాడు. మరోవైపు సాకేత్‌ 0–6, 2–6తో 189వ ర్యాంకర్‌ పీటర్‌ గొజోవిక్‌ (జర్మనీ) చేతిలో ఓడిపోయాడు. మోచేతి గాయం కారణంగా గత ఏడాది ఆరు నెలలపాటు ఆటకు దూరంగా ఉండటంతో యూకీ 534వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

దాంతో గత సంవత్సరం ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో నేరుగా మెయిన్‌ ‘డ్రా’లో ఆడిన ఈ ఢిల్లీ క్రీడాకారుడు ఈసారి మాత్రం క్వాలిఫయింగ్‌లో పోటీపడుతున్నాడు. రెండో రౌండ్‌లో పెద్జా క్రిస్టిన్‌ (సెర్బియా)తో యూకీ ఆడతాడు. 71 నిమిషాలపాటు జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో యూకీ నెట్‌ వద్ద 28 సార్లు దూసుకొచ్చి 20 సార్లు పాయింట్లు గెలిచాడు. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేశాడు. ‘పరిస్థితికి తగ్గట్టు ఆడతాను. గాయం నుంచి కోలుకున్నాక ఆటను ఆస్వాదిస్తున్నాను. రెండో రౌండ్‌ మ్యాచ్‌లోనూ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతాను’ అని యూకీ వ్యాఖ్యానించాడు. మరోవైపు పాదానికి గాయం కావడంతో కోర్టులో చురుకుగా కదల్లేకపోయానని, స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేదని సాకేత్‌ వివరించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement