
మెల్‌బోర్న్: సొంతగడ్డపై భారత్‌తో టెస్టు సిరీస్‌కు సిద్ధమైన ఆస్ట్రేలియా జట్టుకు దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ బంగారం లాంటి సలహా ఇచ్చేశాడు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లితో వాదనకు దిగే ప్రయత్నం చేయవద్దని, కోహ్లితో మౌనంగా ఉండటమే మెరుగైన భాష అని అతను సూచించాడు. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో కోహ్లి సెంచరీ సహా 286 పరుగులు చేశాడు. తొలి రెండు టెస్టుల్లో ఓడిన భారత్ చివరి టెస్టులో గెలిచి 1–2తో సిరీస్ చేజార్చుకుంది.
నాటి తమ అనుభవాన్ని ప్లెసిస్ గుర్తు చేసుకున్నాడు. ‘కోహ్లి అద్భుతమైన ఆటగాడు. ఆడుతున్నప్పుడు అతడిని ఏమీ అనకుండా మౌనంగా ఉండేందుకే ప్రయత్నించాం. అయినా సరే అతను పరుగులు సాధించాడు. ప్రతీ జట్టులో ఒకరిద్దరు ఆటగాళ్లు ఉంటారు. వారిని ఏమైనా అంటే మరింతగా చెలరేగిపోతారని తెలుసు కాబట్టి దానికి దూరంగా ఉండాలని జట్టుగా మేం ముందే నిర్ణయించుకుంటాం. అంతర్జాతీయ క్రికెట్‌లో వాగ్వాదాలను ఇష్టపడే ఆటగాళ్లూ కనిపిస్తారు. కోహ్లితో ఆడినప్పుడు అతనూ గొడవకు దిగేందుకు సిద్ధమనే వ్యక్తని అర్థమైంది. మౌనంగా ఉండటం ద్వారానే అతడిని నియంత్రణలో ఉంచవచ్చు’ అని సఫారీ కెప్టెన్ కంగారూలను హెచ్చరించాడు.