ధోనీ సేనకు ఎదురుదెబ్బ!
ముంబై: ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా దుమ్మురేపింది. విరాట్ కోహ్లీ సేన 4-0తో సిరీస్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు వచ్చేసరికి భారత జట్టుకు గాయాలు వెంటాడుతున్నాయి. ఇంగ్లీష్ మెన్తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు ముందే మహేంద్ర సింగ్ ధోనీ గ్యాంగ్‌కు ఎదురు దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. యువ ఆటగాళ్లు అక్షర్ పటేల్, జయంత్ యాదవ్ గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యే అవకాశాలున్నాయి.
ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ బొటనివేలి గాయంతో బాధపడుతున్నాడు. చెన్నై టెస్టులో అక్షర్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. ఇక ఇదే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన జయంత్ యాదవ్ తొండకండరాల నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో వీరిద్దరూ ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లో ఆడే అవకాశాలు తక్కువ. వచ్చే జనవరి 5 లేదా 6 తేదీల్లో భారత సెలెక్టర్లు జట్టును ప్రకటిస్తారు. భారత్, ఇంగ్లండ్ తొలి వన్డే జనవరి 15న పుణెలో జరగనుంది.