అధికారికంగా ఆసియా క్రీడలు మొదలైన తొలి రోజే భారత్ బంగారు బోణీ చేసింది. భారత మరో యువ రెజ్లర్ బజరంగ్ పూనియా పసిడి పట్టుతో అదరగొట్టాడు. ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన బజరంగ్ ఎదురులేని విజేతగా అవతరించాడు. తొలి రోజు బజరంగ్ మినహా మిగతా భారత రెజ్లర్లు సందీప్, సుశీల్ కుమార్, పవన్, మౌజమ్ ఖత్రి పతకం నెగ్గడంలో విఫలమయ్యారు. మరోవైపు షూటింగ్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో రవికుమార్–అపూర్వీ చండేలా ద్వయం మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది.
జకార్తా: కొంతకాలంగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తోన్న భారత యువ రెజ్లర్ బజరంగ్ పూనియా అదే జోరును ఆసియా క్రీడల్లోనూ కొనసాగించాడు. తన ఉడుంపట్టుతో భారత్ ఖాతాలో తొలి పసిడి పతకాన్ని జమ చేశాడు. ఆదివారం జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ 65 కేజీల విభాగంలో హరియాణాకు చెందిన 24 ఏళ్ల బజరంగ్ విజేతగా అవతరించాడు. ఫైనల్లో బజరంగ్ 11–8 పాయింట్ల తేడాతో తకతాని దైచి (జపాన్)పై గెలుపొందాడు.
ఫైనల్ చేరే క్రమంలో అన్ని బౌట్‌లను టెక్నికల్ సుపీరియారిటీ (ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యం సంపాదించడం) ద్వారా నెగ్గిన బజరంగ్‌కు పసిడి పోరులో కాస్త ప్రతిఘటన ఎదురైంది. ఆరంభంలోనే 6–0తో ఆధిక్యంలోకి వెళ్లిన బజరంగ్ ఆ తర్వాత తడబడి నాలుగు పాయింట్లు కోల్పోయాడు. తొలి విరామానికి 6–4తో ముందంజ వేసిన బజరంగ్ ఆ తర్వాత మరో రెండు పాయింట్లు చేజార్చుకోవడంతో స్కోరు 6–6తో సమమైంది. అనంతరం బజరంగ్ రెండు, తకతాని రెండు పాయింట్లు నెగ్గడంతో మళ్లీ స్కోరు 8–8తో సమమైంది. ఇక బౌట్ మరో నిమిషంలో ముగుస్తుందనగా బజరంగ్ రెండు పాయింట్లు గెలిచి 10–8తో ఆధిక్యంలోకి వచ్చాడు. చివరి సెకన్లలో మరో పాయింట్ గెలిచి 11–8తో విజయాన్ని, స్వర్ణాన్ని ఖాయం చేసుకున్నాడు. అంతకుముందు తొలి రౌండ్‌లో బజరంగ్ 4 నిమిషాల 58 సెకన్లలో 13–3తో సిరోజుద్దీన్ ఖసనోవ్ (ఉజ్బెకిస్తాన్)పై... క్వార్టర్ ఫైనల్లో 3 నిమిషాల 31 సెకన్లలో 12–2తో ఫెజీవ్ అబ్దుల్‌కోసిమ్ (తజికిస్తాన్)పై, సెమీఫైనల్లో 3 నిమిషాల 56 సెకన్లలో 10–0తో బత్‌మాగ్నయ్ బత్చులు (మంగోలియా)పై గెలుపొందాడు. ఆసియా క్రీడలకు ముందు బజరంగ్ కామన్వెల్త్ గేమ్స్, తిబిలిసి గ్రాండ్‌ప్రి, యాసర్ డోగు అంతర్జాతీయ టోర్నీల్లో స్వర్ణాలు గెలిచాడు.
ఈ స్వర్ణాన్ని ఇటీవలే స్వర్గస్తులైన భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్‌పేయికి అంకితంఇస్తున్నాను. యోగీ భాయ్ (యోగేశ్వర్ దత్)కి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాను. 28 ఏళ్ల విరామం తర్వాత యోగేశ్వర్ దత్ గత ఆసియా క్రీడల్లో పసిడి గెలిచాడు. మరో స్వర్ణానికి మళ్లీ అంత విరామం ఉండొద్దని అతను నన్ను కోరాడు. నా తదుపరి లక్ష్యం ప్రపంచ చాంపియన్‌షిప్, 2020 టోక్యో ఒలింపిక్స్. ఈ రెండు మెగా ఈవెంట్స్‌లోనూ స్వర్ణాలు గెలవాలనే లక్ష్యంతో ఉన్నాను.– బజరంగ్
షట్లర్ల జోరు...
భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో కిడాంబి శ్రీకాంత్ సారథ్యంలోని భారత జట్టు 3–0తో మాల్దీవులపై విజయం సాధించింది. ప్రపంచ 8వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–4, 21–5తో హుస్సేన్ జయాన్ షహీద్‌ను చిత్తు చేసి 1–0తో ఆధిక్యం అందించాడు. రెండో మ్యాచ్‌లో 11వ ర్యాంకర్ హెచ్‌ఎస్ ప్రణయ్ 21–8, 21–6తో మొహమ్మద్ సరిమ్‌పై గెలిచి ఆధిక్యాన్ని 2–0కు పెంచాడు. మూడో మ్యాచ్‌లో సాయి ప్రణీత్ 21–7, 21–8తో అజ్ఫాన్ రషీద్‌పై విజయం సాధించాడు. సోమవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ఆతిథ్య ఇండోనేసియాతో భారత పురుషుల జట్టు తలపడనుంది.
అదిరే కూత...
డిఫెండింగ్ చాంపియన్‌లుగా ఆసియా క్రీడల్లో బరిలో దిగిన కబడ్డీ జట్లు హోదాకు తగ్గట్లే సత్తాచాటాయి. పురుషుల జట్టు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా... మహిళల జట్టు తొలి మ్యాచ్‌లో నెగ్గి శుభారంభం చేసింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా పురుషుల జట్టు తొలి మ్యాచ్‌లో 50–21తో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి... రెండో మ్యాచ్‌లో 44–28తో శ్రీలంక పనిపట్టింది. మహిళల విభాగంలో భారత జట్టు 43– 12తో జపాన్‌ను మట్టికరిపించింది. పురుషుల జట్టు తదుపరి మ్యాచ్‌లో దక్షిణ కొరియాతో, మహిళల బృందం థాయ్‌లాండ్‌తో తలపడనున్నాయి.
గోల్స్ మోత...
మహిళల హాకీ జట్టు తొలి మ్యాచ్‌లో గోల్స్ మోత మోగించింది. పూల్ ‘బి’లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 8–0తో ఆతిథ్య ఇండోనేసియాను చిత్తుచేసింది. గుర్జీత్ కౌర్ హ్యాట్రిక్ గోల్స్ (16వ, 22వ, 57వ నిమిషాల్లో)తో సత్తా చాటగా... వందన కటారియా (13వ, 27వ నిమిషాల్లో) రెండు... ఉదిత (6వ ని.లో), లాల్‌రేమ్‌సియామి (24వ ని.లో), నవనీత్ కౌర్ (50వ ని.లో) ఒక్కో గోల్ నమోదు చేశారు.
సుశీల్ విఫలం...
మరోవైపు భారత సీనియర్ స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ రిక్తహస్తాలతో వెనుదిరిగాడు. వరుసగా మూడు కామన్వెల్త్ గేమ్స్ (2010, 2014, 2018)లలో స్వర్ణాలు గెలిచిన సుశీల్ 74 కేజీల విభాగం తొలి రౌండ్‌లోనే 3–5తో ఆడమ్ బతిరోవ్ (బహ్రెయిన్) చేతిలో ఓడిపోయాడు. 2006 దోహా ఆసియా క్రీడల్లో కాంస్యం నెగ్గిన సుశీల్ 2010, 2014లలో దూరంగా ఉన్నాడు. 57 కేజీల విభాగంలో సందీప్ కుమార్ క్వార్టర్ ఫైనల్లో 9–15తో రెజా అత్రియానఘర్చి (ఇరాన్) చేతిలో... 97 కేజీల విభాగంలో మౌజమ్ ఖత్రీ క్వార్టర్ ఫైనల్లో 0–8తో ఇబ్రాజిమోవ్ మగోమెడ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో... 86 కేజీల విభాగం కాంస్య పతక పోరులో పవన్ కుమార్ 1–8తో ఒర్గోడోల్ ఉతమెన్ (మంగోలియా) చేతిలో ఓడిపోయారు.
టెన్నిస్‌లో శుభారంభం...
టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత జోడీ తొలి రౌండ్‌లో సునాయస విజయం సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో దివిజ్ శరణ్–కర్మన్ కౌర్ జోడీ 6–4, 6–4తో మారియన్ జెన్–అల్బెర్టో లిమ్ (ఫిలిప్పిన్స్) జంటపై గెలిచింది.
స్విమ్మింగ్‌లో నిరాశ...
స్విమ్మింగ్‌లో పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ విభాగంలో ఫైనల్ చేరిన సజన్ ప్రకాశ్ తృటిలో పతకం చేజార్చుకున్నాడు. అతను 1ని.57.75 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఐదో స్థానానికి పరిమితమయ్యాడు. మరోవైపు పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఫైనల్లో నటరాజ్ శ్రీహరి 56.19 సెకన్లలో లక్ష్యాన్ని చేరి 7వ స్థానంలో నిలిచాడు. పురుషుల 200 మీటర్ల ఫ్రీస్టయిల్ హీట్స్‌లో భారత స్మిమ్మర్ సౌరభ్ 1ని.54.87 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు.
టీమ్ విభాగాల్లో చుక్కెదురు...
►బాస్కెట్‌బాల్‌లో మహిళల జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లో ఓటమి పాలైంది. తొలి మ్యాచ్‌లో కజకిస్తాన్ చేతిలో ఓడిన భారత్ ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో 61–84తో చైనీస్ తైపీ చేతిలో పరాజయం పాలైంది.
►హ్యాండ్‌బాల్‌లో మహిళల జట్టు పరాజయాల బాట వీడలేదు. ఆదివారం జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్ 21–36తో చైనా చేతిలో ఓటమి పాలైంది. మనిందర్ కౌర్ 10 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా లాభం లేకపోయింది.
►తైక్వాండో పూమ్‌సే ఈవెంట్‌లో భారత మహిళల జట్టు ఓటమి పాలైంది. అనామిక, మమత కులకర్ణి, శిల్ప థాపాలతో కూడిన భారత బృందం థాయ్‌లాండ్ చేతిలో ఓడింది.
► వాలీబాల్‌లో భారత మహిళల జట్టు తొలి మ్యాచ్‌లో 17–25, 11–25, 13–25తో దక్షిణ కొరియా చేతిలో ఓడింది.
► సెపక్‌తక్రాలో భారత మహిళల జట్టు రెగూ ప్రిలిమినరీ లీగ్ మ్యాచ్‌లో 0–3తో కొరియా చేతిలో పరాజయం పాలైంది.
Comments
Please login to add a commentAdd a comment