
'టీమిండియాను ఓడించడం కష్టమే'
దుబాయ్:స్వదేశంలో భారత క్రికెట్ జట్టు చాలా ప్రమాదకరమైనదని ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వాట్సన్ అభిప్రాయపడ్డాడు. భారత్ ను వారి దేశంలో ఓడించడం అంత సులువు కాదని స్పష్టం చేశాడు. వచ్చే నెలలో ఆరంభం కానున్న వరల్డ్ టీ 20లో భారత జట్టే ఫేవరెట్ గా వాట్సన్ అభివర్ణించాడు. 'నా దృష్టిలో భారత్ అత్యంత క్లిష్టమైన జట్టు. ఆ జట్టుకు స్వదేశీ పరిస్థితులు కచ్చితంగా కలిసొస్తాయి. దాంతో టీమిండియానే వరల్డ్ కప్ ఫేవరెట్' అని వాట్సన్ తెలిపాడు.
పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) లో పాల్గొనేందుకు దుబాయ్ కు వచ్చిన వాట్సన్ క్రికెట్.డాట్.కమ్. ఏయూతో ముచ్చటించాడు. ప్రత్యర్థి జట్లు ఆడేదాని కంటే కూడా స్వదేశంలో పరిస్థితులు టీమిండియాకు కలిసొస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. నైపుణ్యం ఉన్న ఆటగాళ్లతో భారత జట్టు సమతుల్యంగా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. బ్యాటింగ్ లో అత్యంత దూకుడుగా ఉండే భారత్.. బౌలింగ్ విభాగంలో కూడా మెరుగ్గానే ఉందన్నాడు. ప్రత్యేకంగా స్పిన్నర్ల విషయానికొస్తే మ్యాచ్ ను క్షణాల్లో ప్రభావితం చేసే అత్యుత్తమ స్పిన్నర్లు వారి సొంతమన్నాడు. పేస్ విభాగంలో సీనియర్ ఆటగాడు ఆశిష్ నెహ్రా, యువ బౌలర్ బూమ్రాల రాకతో భారత జట్టులో చక్కటి సమన్వయం కనబడుతుందని ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన వాట్సన్ తెలిపాడు.