దక్షిణాఫ్రికా ఢమాల్‌ | Bangladesh won by 21 runs against South Africa | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికా ఢమాల్‌

Published Mon, Jun 3 2019 1:32 AM | Last Updated on Mon, Jun 3 2019 8:09 AM

Bangladesh won by 21 runs against South Africa - Sakshi

ప్రపంచ కప్‌లలో ఫేవరెట్‌గా బరిలోకి దిగి... వరుస విజయాల తర్వాత కీలక దశలో అదృష్టం మొహం చాటేస్తేనో లేక అనూహ్యంగా ఓటమి పాలై ‘చోకర్స్‌’గా ముద్రపడిన దక్షిణాఫ్రికా జట్టును ఇప్పటి వరకు చూశాం. మేం ’చోకర్స్‌’ కాదని నిరూపించుకుంటాం అని చెప్పిన సఫారీలు... టోర్నీ చివర్లో కాదు, ఆరంభం నుంచే ఓడిపోయి ఆ ముద్రను తొలగించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది! మొదటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చేతిలో చిత్తుగా ఓడిన డు ప్లెసిస్‌ బృందం ఇప్పుడు బంగ్లాదేశ్‌ ముందు కూడా కుప్పకూలింది.

ముందుగా పేలవ బౌలింగ్‌తో బంగ్లాదేశ్‌ వన్డేల్లో తమ అత్యధిక స్కోరు నమోదు చేసేందుకు అవకాశమిచ్చి... ఆపైన పేలవ బ్యాటింగ్‌తో ఓటమిని ఆహ్వానించింది. జట్టులో ఒకరితో మరొకరు పోటీ పడుతూ స్ఫూర్తిదాయక ఆటతీరుకనబర్చిన బంగ్లా పులులు అద్భుత విజయంతో టోర్నీని ఆరంభించారు. ప్రపంచ కప్‌ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమై వచ్చి సవాల్‌కు సిద్ధమైనఆ జట్టు తమను ఇంకెవరూ బేబీలుగా చూడవద్దంటూ, తక్కువగా అంచనా వేయవద్దంటూ హెచ్చరిక జారీ చేసింది.   

 లండన్‌: వరుసగా సాగిన ఏకపక్ష మ్యాచ్‌ల తర్వాత వరల్డ్‌ కప్‌ ఒక ఆసక్తికర పోరుకు వేదికైంది. అయితే తుది ఫలితం మాత్రం అందరూ ఊహించిన దానికి భిన్నంగా వచ్చింది. ఆదివారం ఇక్కడి ఓవల్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 21 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. ముష్ఫికర్‌ రహీమ్‌ (80 బంతుల్లో 78; 8 ఫోర్లు)... ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’షకీబ్‌ అల్‌ హసన్‌ (84 బంతుల్లో 75; 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు సాధించగా... మహ్ముదుల్లా (33 బంతుల్లో 46 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), సౌమ్య సర్కార్‌ (30 బంతుల్లో 42; 9 ఫోర్లు) రాణించారు. అనంతరం దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 8 వికెట్లకు 309 పరుగులు చేసి ఓడిపోయింది. కెప్టెన్‌ ఫాఫ్‌ డు ప్లెసిస్‌ (53 బంతుల్లో 62; 5 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌ సెంచరీ చేయగా... జేపీ డుమిని (37 బంతుల్లో 45; 4 ఫోర్లు), మార్క్‌రమ్‌ (56 బంతుల్లో 45; 4 ఫోర్లు), వాన్‌ డర్‌ డసెన్‌ (38 బంతుల్లో 41; 2 ఫోర్లు, 1 సిక్స్‌) పోరాడారు.  

142 పరుగుల భాగస్వామ్యం...
ఒక భారీ సెంచరీ పార్ట్‌నర్‌షిప్, మరో రెండు అర్ధ సెంచరీ భాగస్వామ్యాల సహాయంతో బంగ్లాదేశ్‌ తమ అత్యుత్తమ వన్డే స్కోరును నమోదు చేయగలిగింది. ఓపెనర్లలో సర్కార్‌ దూకుడు ప్రదర్శించగా, తమీమ్‌ ఇక్బాల్‌ (16) తన శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడాడు. తొలి ఐదు ఓవర్లను జాగ్రత్తగా ఆడిన బంగ్లా 14 పరుగులే చేసింది. అయితే ఇన్‌గిడి వేసిన ఆరో ఓవర్లో సర్కార్‌ మూడు ఫోర్లు కొట్టడంతో 14 పరుగులు వచ్చాయి. ఇన్‌గిడి తర్వాతి ఓవర్లో కూడా బంగ్లా మరో మూడు ఫోర్లతో 13 పరుగులు రాబట్టింది.

ఈ ఓవర్‌ వేయగానే ఇన్‌గిడి కండరాల గాయంతో మైదానం వీడటంతో దక్షిణాఫ్రికా తమ ప్రధాన పేసర్‌ సేవలు కోల్పోయింది. అనంతరం తమీమ్‌ను ఔట్‌ చేసి ఫెలుక్‌వాయో 60 పరుగుల మొదటి వికెట్‌ భాగస్వామ్యాన్ని విడదీయగా, తొలి పవర్‌ప్లేలో బంగ్లా 65 పరుగులు చేయగలిగింది. మోరిస్‌ తన తొలి ఓవర్లోనే జట్టుకు వికెట్‌ అందించాడు. మరో భారీ షాట్‌కు ప్రయత్నించిన సర్కార్‌...డి కాక్‌ అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. ఆ తర్వాత షకీబ్, ముష్ఫికర్‌ మూడో వికెట్‌ భాగస్వామ్యం బంగ్లా భారీ స్కోరుకు బాటలు వేసింది.

భారీ షాట్లు ఆడే సాహసం చేయకుండా వీరిద్దరు చక్కటి సమన్వయంతో, జాగ్రత్తగా బ్యాటింగ్‌ చేస్తూ పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో ముందుగా షకీబ్‌ 54 బంతుల్లో, ఆ తర్వాత ముష్ఫికర్‌ 52 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఈ జోడి దక్షిణాఫ్రికా జట్టులో తీవ్ర అసహనం రేపుతున్న దశలో ఎట్టకేలకు ‘ట్రంప్‌ కార్డ్‌’తాహిర్‌ ఈ జంటను విడదీశాడు. తాహిర్‌ వేసిన చక్కటి బంతికి షకీబ్‌ క్లీన్‌బౌల్డయ్యాడు. పార్ట్‌టైమర్‌ మార్క్‌రమ్‌ ఓవర్లో సిక్స్, ఫోర్‌ బాదిన మిథున్‌ (21)ను కూడా తాహిరే బౌల్డ్‌ చేయగా...కొద్ది సేపటికే ముష్ఫికర్‌ కూడా పెవిలియన్‌ చేరాడు. ఈ దశలో బంగ్లా స్కోరు 250 పరుగులు. తర్వాతి 7.5 ఓవర్లలో ఆ జట్టు ఏకంగా 80 పరుగులు సాధించడం విశేషం.

కెప్టెన్‌ అర్ధ సెంచరీ....
భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో దక్షిణాఫ్రికా జట్టులో తడబాటు కనిపించింది. గత మ్యాచ్‌లో తలకు బంతి తగిలిన ఆమ్లా పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. మార్క్‌రమ్, డి కాక్‌ (23) తొలి వికెట్‌కు 49 పరుగులు జోడించినా వీరిద్దరు ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేయలేకపోయారు. మార్క్‌రమ్‌ను సునాయాసంగా రనౌట్‌ చేయడంలో విఫలమైన బంగ్లా... కొద్ది సేపటికి డి కాక్‌ను రనౌట్‌గా వెనక్కి పంపించింది. మెహదీ బౌలింగ్‌లో డి కాక్‌ ఇచ్చిన క్యాచ్‌ను కీపర్‌ ముష్ఫికర్‌ వదిలేయగా, బ్యాట్స్‌మన్‌ సింగిల్‌ కోసం ప్రయత్నించాడు. అయితే వేగంగా వెనక్కి వెళ్లి బంతిని అందుకున్న ముష్ఫికర్‌ నేరుగా వికెట్లపైకి కొట్టడంతో డి కాక్‌ ఔటయ్యాడు. వరుస బౌండరీలతో కెప్టెన్‌ డు ప్లెసిస్‌ దూకుడుగా ఆడి ప్రత్యర్థిపై పైచేయి సాధించే ప్రయత్నం చేయగా... మరో ఎండ్‌లో మార్క్‌రమ్‌ను బౌల్డ్‌ చేసి షకీబ్‌ తన కెరీర్‌లో 250వ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు.

45 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న ప్లెసిస్‌... మెహదీ బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడబోయి బౌల్డ్‌ కావడంతో సఫారీ జట్టులో ఆందోళన పెరిగింది. 16 పరుగుల వద్ద సర్కార్‌ క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన డేవిడ్‌ మిల్లర్‌ (43 బంతుల్లో 38; 2 ఫోర్లు) తన స్కోరుకు మరికొన్ని పరుగులు జోడించి వెనుదిరిగాడు. ముస్తఫిజుర్‌ ఓవర్లో సిక్స్, ఫోర్‌ కొట్టి జోరు పెంచే ప్రయత్నం చేసిన డసెన్‌ను సైఫుద్దీన్‌ బౌల్డ్‌ చేయడంతో బంగ్లా శిబిరంలో విజయానందం కనిపించింది. చివర్లో డుమిని కొన్ని చక్కటి షాట్లతో పోరాడే ప్రయత్నం చేసినా అప్పటికే ఆలస్యమైపోయింది. గెలుపు తర్వాత బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు ఎలాంటి అతి సంబరాలకు పోకుండా ప్రశాంతంగా కనిపించడం ఆ జట్టు ఆలోచనల్లో వచ్చిన మార్పుగా చెప్పవచ్చు.  

►5 షకీబ్‌ అల్‌ హసన్‌ వన్డేల్లో 250 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. 5 వేల పరుగులు చేయడంతో పాటు 250 వికెట్లు తీసిన ఐదో ఆటగాడిగా (జయసూర్య, ఆఫ్రిది, కలిస్, రజాక్‌ తర్వాత) షకీబ్‌ నిలిచాడు. అందరికంటే తక్కువ వన్డేల్లో (199) అతను ఈ ఘనత సాధించడం విశేషం.  

►330బంగ్లాదేశ్‌కు వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరు. గతంలో పాకిస్తాన్‌పై చేసిన 329 పరుగుల రికార్డును ఆ జట్టు అధిగమించింది.  

►100దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ 100 వన్డేలు పూర్తి చేసుకున్నాడు. అతను ఇప్పటికి 166 వికెట్లు పడగొట్టాడు.  

►2  ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై బంగ్లాకు ఇది రెండో విజయం. గతంలో 2007 ప్రపంచ కప్‌లోనూ ఆ జట్టు గెలిచింది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement