ఈ ప్రపంచ కప్‌లో టాస్ గెలిచిన కెప్టెన్లు తడుముకోకుండా చెబుతున్న ఒకే ఒక్క మాట... ‘మేం ముందుగా బౌలింగ్ చేయదల్చుకున్నాం’ అని. టాస్ ఓడిన కెప్టెన్ సైతం తమ ఉద్దేశం తొలుత బౌలింగ్ చేయాలన్నదే అని అంటుండటం ఇక్కడ గమనించాల్సిన విషయం. పిచ్‌పై మొదట్లో కనిపిస్తున్న కాసింత పచ్చిక అనుకోని వరంలా వారిని ఊరిస్తుండటమే దీనికి కారణం. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు జరగ్గా... చిన్న జట్టయిన అఫ్గానిస్తాన్ మినహా మిగతా మూడు పెద్ద జట్లు తొలుత బౌలింగ్‌కే మొగ్గుచూపాయి. పచ్చికపై పేస్, స్వింగ్‌తో ప్రత్యర్థి టాపార్డర్‌ను ఇబ్బంది పెట్టాయి. ఆసీస్‌పై ముందు బ్యాటింగ్‌కు దిగి అఫ్గాన్ తొలుతే రెండు వికెట్లు కోల్పొయింది.
వెస్టిండీస్, న్యూజిలాండ్ సరిగ్గా ఇలానే ఫలితాన్ని పొందాయి. ప్రారంభ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా సైతం తొలుత కొంత లాభపడినా... సొంతగడ్డ అనుకూలతతో ఇంగ్లండ్ వెంటనే పుంజుకొంది. ముఖ్యంగా తొలి గంట పిచ్ నుంచి పేసర్లకు మంచి మద్దతు దొరుకుతోంది. దీంతో పేస్‌ను ఆడటంలో బలహీనులైన పాకిస్తాన్, శ్రీలంక బ్యాట్స్‌మెన్ వికెట్ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో ఓపెనర్లు కనీసం పది ఓవర్లు నిలిస్తేనే ఏ జట్టయినా మంచి స్కోరు చేసేందుకు వీలుంటుంది. అనంతరం బ్యాటింగ్‌కు అనువుగా మారుతున్న పిచ్‌పై పరుగులు సులువుగా వస్తున్నాయి. ఇప్పటివరకు పెద్దగా ప్రభావం చూపకున్నా, టోర్నీ సాగే కొద్దీ మబ్బులు కమ్మిన వాతావరణం ఎదురయ్యే వీలుంది. దీన్నిబట్టి చూస్తే బలమైన పేస్ దళం ఉన్న జట్లు టాస్ గెలిస్తే మ్యాచ్ దాదాపు వారి చేతుల్లోకి వెళ్లినట్లేనేమో?
Comments
Please login to add a commentAdd a comment