
'అతడితో కలిసి బ్యాటింగ్ చేయడం గొప్ప అనుభవం'
షార్జా: దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాక్వెస్ కలిస్తో కలిసి బ్యాటింగ్ చేయడం తాను నమ్మలేకపోతున్నానని కోల్కతా నైట్రైడర్స్ ఆటగాడు క్రిస్‌లిన్ అన్నాడు. ఇది తనకు నమ్మశక్యంకాని అనుభవమని పేర్కొన్నాడు. క్రీజులో కలిస్ చాలా రిలాక్స్గా ఉంటాడని అందువల్ల అతడు ఒత్తిడికి గురికాడని వెల్లడించాడు. నిశ్శబ్దంగా బ్యాటింగ్ చేస్తూ మంచి భాగస్వామ్యాలు నెలకొల్పుతాడని చెప్పాడు.
గొప్ప క్రికెటర్లలో కలిస్ ఒకడని కితాబిచ్చాడు. ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా బ్యాటింగ్ చేయడం కలిస్ ప్రత్యేకత అని 24 ఏళ్ల క్రిస్‌లిన్ అన్నాడు. బెంగళూరు రాయల్ చాలెంజర్స్తో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్లో సంచలన క్యాచ్తో కోల్కతాకు క్రిస్లిన్ విజయాన్ని అందించాడు. 31 బంతుల్లో 45 పరుగులు చేసి బ్యాటింగ్లోనూ రాణించాడు.