
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌పై చేస్తున్న పోరాటాన్ని టెస్టు క్రికెట్‌తో పోల్చాడు దిగ్గజ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. కరోనాపై పోరులో ప్రజలందరికీ సహనం, సమష్టితత్వం, అప్రమత్తత అవసరమని సచిన్ తెలిపాడు. ‘ప్రపంచమంతా కరోనాపై పోరాటం చేస్తుంది. ఈ సందర్భంగా క్రికెట్‌లో సాంప్రదాయ ఫార్మాట్ అయిన టెస్టు క్రికెట్‌ను మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి. టెస్టు క్రికెట్ ఎన్నో విషయాలను మనకు బోధిస్తుంది. ప్రధానంగా సహనానికి ఉన్న విలువను చూపెడుతోంది. పిచ్ పరిస్థితులను, బౌలర్ శైలిని మనం అర్థం చేసుకుని సుదీర్ఘంగా బ్యాటింగ్ చేయాలి. ఇక్కడ అత్యంత రక్షణాత్మకంగా ఆడటం కూడా చాలా ముఖ్యం. ప్రస్తుత ప్రపంచానికి కావాల్సిందే ఓర్పు. కరోనాపై మనల్ని రక్షించుకోవాలంటే ఎంతో ఓపిక అవసరం’ అని సచిన్ తన పరిభాషలో వివరించాడు. (22న జనతా కర్ఫ్యూ)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై నిర్లక్ష్యం తగదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హితవు పలికిన సంగతి తెలిసిందే.. వైరస్ సోకకుండా, వ్యాప్తి చెందకుండా ప్రజలంతా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వాల సూచనలను తు.చ తప్పకుండా పాటించాలని కోరారు. దీనిలో భాగంగా ఆదివారం(మార్చి 22) ఉదయం 7గంటల నుంచి రాత్రి 9 గంటలకు ఎవరూ బయటకు వెళ్లకుండా ఉండాలని సూచించారు. ఈ ‘జనతా కర్ఫ్యూ’కు అందరూ సహకరించాలని కోరారు. అత్యవసరమైతే తప్పితే అంతా కూడా స్వీయ నిర్భందాన్ని పాటించాలన్నారు. దీనిపై సచిన్ స్పందించాడు. కరోనా వైరస్ నిరోధానికి ఇది కూడా ఎంతో ముఖ్యమైనదన్నాడు. ప్రధాని మోదీ సూచించిన సలహాను అంతా పాటిద్దాం అని సచిన్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment