ముంబై: భారత క్రికెటర్లు విదేశీ పర్యటనల సందర్భంగా భార్యలతో గడిపే విషయంలో కొత్త పాలసీని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అమలులోకి తేనుంది. ఇకపై పర్యటనల్లో భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ క్రికెటర్లతో 14 రోజులు ఉండేందుకు అనుమతించనుంది. అయితే పర్యటన మొదలయ్యాక రెండు వారాల తర్వాతే ఆటగాళ్లకు ఈ వెసులుబాటు లభిస్తుంది. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ లో కనీసం మూడు మ్యాచ్‌ల వరకూ భార్యలకు దూరంగా ఉండాలని బీసీసీఐ ఇటీవల సూచించింది.
భారత క్రికెటర్లు ఏ దేశ పర్యటనకు వెళ్లినా వారి భార్యలు, ప్రియురాళ్లతో అక్కడ వాలిపోవడం సర్వసాధారణం. దానిలో భాగంగా మ్యాచ్‌లకు మధ్య వచ్చే విరామాల్లో చెట్టా పట్టాలేసుకుని విహరిస్తుంటారు. తాజాగా ఇంగ్లండ్ పర్యటనలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ అనంతరం విరాట్ కోహ్లి , శిఖర్ ధావన్, ఉమేశ్ యాదవ్, రోహిత్ శర్మ సహా మరికొంత మంది క్రికెటర్లు తమ జీవిత భాగస్వాములతో సరదాగా గడిపారు. అయితే గతంలో విదేశీ పర్యటనల సందర్భంగా చోటుచేసుకున్న ఉదంతాల నేపథ్యంలో కొత్త పాలసీని తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఏదేని టోర్నీ, సిరీస్‌ల్లో భారత్ విఫలమైన తరుణంలో క్రికెటర్ల భార్యలపై విమర్శలు వస్తుండడంతో బీసీసీఐ తాజా పాలసీని అమలులోకి తీసుకు రానున్నట్లు ముంబై మిర్రర్ ఓ కథనాన్ని ప్రచురించింది.
చదవండి: భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్‌ను దూరం పెట్టండి..
Comments
Please login to add a commentAdd a comment