లండన్: భారత క్రికెటర్లు ఏ దేశ పర్యటనకు వెళ్లినా వారి భార్యలు, ప్రియురాళ్లతో అక్కడ వాలిపోవడం సర్వసాధారణం. దానిలో భాగంగా మ్యాచ్‌లకు మధ్య వచ్చే విరామాల్లో చెట్టా పట్టాలేసుకుని విహరిస్తుంటారు. తాజాగా ఇంగ్లండ్ పర్యటనలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ అనంతరం విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్, ఉమేశ్ యాదవ్, రోహిత్ శర్మ సహా మరికొంత మంది క్రికెటర్లు తమ జీవిత భాగస్వాములతో సరదాగా గడిపారు. అయితే త్వరలో టెస్టు సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో క్రికెటర్లు వారి కుటుంబాలకు దూరంగా ఉండాలని బీసీసీఐ మేనేజ్‌మెంట్ ఆదేశించింది.
ప్రధానంగా సిరీస్ జరుగుతున్న సమయంలో భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్‌ను దూరం పెట్టాలని సూచించింది. తొలి మూడు టెస్టులకు తమ జీవిత భాగస్వాములను తీసుకురావద్దని మేనేజ్‌మెంట్ కోహ్లి సేనకు వెల్లడించింది. ఈ మేరకు ‘ముంబై మిర్రర్’ కథనాన్ని ప్రచురించింది.
‘టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవడానికి మాకు నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఆటగాళ్లంతా వారి భార్యలు, స్నేహితులు, బంధువులకు దూరం అవుతున్నారు. మేమంతా సోమవారం చెమ్స్‌ఫోర్డ్‌కు బయలుదేరుతాం’ అని జట్టులోని ఓ వ్యక్తి వెల్లడించినట్లు ముంబై మిర్రర్ పేర్కొంది.
గతంలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులతో పర్యటనలకు వెళ్లినప్పుడు మన ఆటగాళ్లు పేలవ ప్రదర్శనలను ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకునే మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోవడంతో.. భారత ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment