పంజాబ్ కింగ్స్ బోణీ
► రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌పై విజయం
► రాణించిన మ్యాక్స్‌వెల్, మిల్లర్
ఇండోర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు బోణీ చేసింది. కీలక సమయంలో కొత్త కెప్టెన్ మ్యాక్స్‌వెల్ (20 బంతుల్లో 44 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (27 బంతుల్లో 30 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) సమయోచితంగా రాణించారు. దాంతో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌పై పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. లీగ్‌లో ఇప్పటిదాకా ఎనిమిది సార్లు ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పుణే అన్నింటిలోనూ పరాజయం పాలైంది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పుణే 20 ఓవర్లలో 6 వికెట్లకు 163 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా, మనోజ్ తివారి (23 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుగ్గా ఆడాడు. సందీప్ శర్మకు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టు 19 ఓవర్లలో నాలుగు వికెట్లకు 164 పరుగులు చేసింది. ఆమ్లా (27 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్), అక్షర్ పటేల్ (22 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్స్) పర్వాలేదనిపించారు. మ్యాక్స్‌వెల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఆదుకున్న స్టోక్స్, తివారి: పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించకపోవడంతో పుణే బ్యాట్స్‌మెన్ ఆచితూచి ఆడారు. తొలి ఓవర్‌లోనే మయాంక్ పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. నాలుగో ఓవర్‌లో రహానే (15 బంతుల్లో 19; 1 ఫోర్, 1 సిక్స్) ఇచ్చిన క్యాచ్‌ను వోహ్రా వదిలేయగా... అదే ఓవర్‌లో అతను వరుసగా 6,4 బాది స్కోరులో వేగం తెచ్చాడు. ఆ తర్వాత ఓవర్‌లో కెప్టెన్ స్మిత్ (27 బంతుల్లో 26; 3 ఫోర్లు) వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు.
కానీ తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న నటరాజన్ తన తొలి ఓవర్‌లోనే రహానే వికెట్ తీసి పంజాబ్ జట్టులో సంతోషం నింపాడు. మరో ఓవర్ వ్యవధిలో స్మిత్ వికెట్‌ను స్టొయినిస్ తీయడంతో పుణే 49 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అటు ధోని (5) కూడా విఫలం కావడంతో భారమంతా స్టోక్స్, తివారిలపై పడింది. వీరిద్దరి జోరుకు తోడు చివర్లో క్రిస్టియాన్ 4,4,6 బాదడంతో జట్టు మంచి స్కోరు సాధించగలిగింది.
మ్యాక్స్‌వెల్ బాదుడు: లక్ష్యం కోసం బరిలోకి దిగిన పంజాబ్ ఇన్నింగ్స్ ధాటిగా ప్రారంభించింది. క్రీజులో ఉన్నంతసేపు స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపించిన వోహ్రా (9 బంతుల్లో 14; 1 ఫోర్, 1 సిక్స్) మూడో ఓవర్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత వరుస ఫోర్లతో జోరు చూపించిన సాహా (14; 3 ఫోర్లు)ను తాహిర్ తన తొలి ఓవర్‌లోనే బౌల్డ్ చేశాడు. పవర్‌ప్లేలో పంజాబ్ 56 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత 4 ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా పుణే బౌలర్లు కట్టడి చేయగలిగారు. దీంతో ఒత్తిడికి లోనైన అక్షర్, ఆమ్లా వరుస ఓవర్లలో వికెట్లను చేజార్చుకున్నారు. అయితే మ్యాక్స్‌వెల్, మిల్లర్ ధాటిగా ఆడి పంజాబ్‌కు విజయాన్ని అందించారు.
స్కోరు వివరాలు
రైజింగ్ పుణే సూపర్ జెయింట్ ఇన్నింగ్స్: రహానే (సి) స్టొయినిస్ (బి) నటరాజన్ 19; మయాంక్ అగర్వాల్ (బి) సందీప్ శర్మ 0; స్మిత్ (సి) వోహ్రా (బి) స్టొయినిస్ 26; స్టోక్స్ (సి అండ్ బి) అక్షర్ 50; ధోని (సి అండ్ బి) స్వప్నిల్ సింగ్ 5; మనోజ్ తివారి నాటౌట్ 40; క్రిస్టియాన్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) సందీప్ శర్మ 17; రజత్ భాటియా నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో ఆరు వికెట్లకు) 163. వికెట్ల పతనం: 1–1, 2–36, 3–49, 4–71, 5–132, 6–162. బౌలింగ్: సందీప్ 4–0–33–2; మోహిత్ 4–0–34–0; అక్షర్ 4–0–27–1; నటరాజన్ 3–0–26–1; స్టొయినిస్ 3–0–28–1; స్వప్నిల్ సింగ్ 2–0–14–1.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: ఆమ్లా (సి) స్టోక్స్ (బి) చహర్ 28; వోహ్రా (సి) తివారి (బి) దిండా 14; సాహా (బి) తాహిర్ 14; అక్షర్ (సి అండ్ బి) తాహిర్ 24; మ్యాక్స్‌వెల్ నాటౌట్ 44; మిల్లర్ నాటౌట్ 30; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (19 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–27, 2–49, 3–83, 4–85. బౌలింగ్: దిండా 3–0–26–1; క్రిస్టియాన్ 2–0–24–0; స్టోక్స్ 4–0–32–0; తాహిర్ 4–0–29–2; చహర్ 4–0–32–1; భాటియా 2–0–20–0.