
ఎందుకిలా...నా‘డల్’
రఫెల్ నాదల్... టెన్నిస్ ప్రపంచానికి పరిచయం అవసరం లేని పేరు. రెండేళ్ల క్రితం ఏ టోర్నీలో అయినా నాదల్ ఎదురవుతున్నాడంటే వణికిపోయిన ప్రత్యర్థులు... ఇప్పుడు నాదల్‌తో మ్యాచ్ అంటే లైట్ తీసుకునే స్థితి వచ్చింది. ఈసారి వింబుల్డన్ రెండో రౌండ్‌లో డస్టిన్ బ్రౌన్ అనే అనామక క్రీడాకారుడి చేతిలో ఓడిపోయాడు. ఇక తనకు ఎదురులేని ఫ్రెంచ్ ఓపెన్‌లో కూడా ఈసారి క్వార్టర్స్‌తోనే సరిపెట్టుకున్నాడు. ఎందుకిలా జరుగుతోంది. ఒక్కసారిగా నాదల్ ఎందుకు డల్ అయ్యాడు?
వింబుల్డన్‌లో నాదల్‌కు గురువారం షాక్ తగిలే ఓటమి ఎదురైంది. డస్టిన్ బ్రౌన్ అనే అనామక జర్మనీ క్రీడాకారుడు 7-5, 3-6, 6-4, 6-4 స్కోరుతో నాదల్‌ను ఓడించాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 102వ స్థానంలో ఉన్న బ్రౌన్ చేతిలో ఓటమి నాదల్ కెరీర్ గురించి చర్చకు తెరలేపింది. 100కు పైన ర్యాంక్ ఉన్న క్రీడాకారుడి చేతిలో వింబుల్డన్‌లో నాదల్ ఓడిపోవడం ఇది వరుసగా నాలుగో ఏడాది. కెరీర్ ఆరంభం నుంచి కూడా మిగిలిన టోర్నీలతో పోలిస్తే పచ్చిక కోర్టుల మీద నాదల్ అంత బలమైన ఆటగాడు కాదు. అయితే ఈ ఏడాది ఇప్పటివరకూ అతను కేవలం రెండు టూర్ టైటిల్స్ మాత్రమే నెగ్గాడు. ఏ గ్రాండ్‌స్లామ్‌లోనూ కనీసం క్వార్టర్ ఫైనల్ దశ దాటలేదు.
కెరీర్‌లో మొత్తం 14 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్. అందులో రెండు వింబుల్డన్ కూడా సాధించిన నాదల్ శకం ముగిసిందనే చర్చ ఇప్పుడు టెన్నిస్ ప్రపంచంలో జోరుగా సాగుతోంది. అయితే నాదల్‌ను అంత తేలిగ్గా తీసిపారేయలేం. ప్రస్తుతం టెన్నిస్ ప్రపంచంలో జోరు మీదున్న జొకోవిచ్ కంటే నాదల్ కేవలం ఏడాది మాత్రమే పెద్దవాడు. అయితే 33 ఏళ్ల ఫెడరర్‌లో కనిపిస్తున్న ఉత్సాహం నాదల్‌లో ప్రస్తుతం కనిపించడం లేదు. దీనికి కారణం ఏమిటో విశ్లేషించాలి.
ఫిట్‌నెస్ పెరగాలి
గత ఏడాది నాదల్ తీవ్రంగా గాయాల బారిన పడ్డాడు. ఆ తర్వాత అతనిలో పూర్వపు స్థాయి ఫిట్‌నెస్ కనిపించడం లేదు. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఇది స్పష్టంగా కనిపించింది. తన షాట్లలో కూడా పూర్వపు స్థాయిలో ‘పవర్’ కనిపించడం లేదు. దీనికి తోడు ప్రత్యర్థులంతా నాదల్‌ను ఇప్పటికే బాగా ఆకళింపు చేసుకున్నారు. తన సర్వ్ అండ్ వాలీ గేమ్‌ను అర్థం చేసుకున్నారు. ఈ విషయంలో అప్‌డేట్ కాకపోవడం నాదల్ సహాయక బృందం చేస్తున్న తప్పిదం.
కోచ్‌ను మార్చాలా?
నాదల్ కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి తన అంకుల్ టోనీ శిక్షణలోనే ఆడుతున్నాడు. ఇటీవల కాలంలో టెన్నిస్‌లో పోటీ బాగా పెరిగింది. అందుకే మాజీ ఆటగాళ్ల సేవలను చాలామంది తీసుకుంటున్నాడు. జొకోవిచ్‌కు బోరిస్ బెకర్... ఫెడరర్‌కి ఎడ్బర్గ్... ఆండీ ముర్రేకి అమెలీ మౌరెస్మో... ఇలా స్టార్ ఆటగాళ్లంతా మాజీలను తెచ్చి కోచ్‌లుగా నియమించుకుంటున్నారు. వాళ్ల అనుభవాన్ని కూడా తీసుకుని రాటు దేలుతున్నారు. కానీ నాదల్ మాత్రం ఇప్పటివరకూ ఇలాంటి ప్రయత్నం చేయలేదు.
కాబట్టి కోచ్‌ను మార్చి చూడాలనేది ఒక సలహా. ‘నాదల్ క్యాంప్‌లో కొత్త రక్తం రావాలి. పాత పద్ధతిలోనే తన ఆట సాగుతోంది. మిగిలిన ప్రపంచం మారిందనే విషయం గుర్తించాలి. సెంటిమెంట్‌ను పక్కనబెట్టి కొత్త కోచ్‌ను తీసుకుంటే తన కెరీర్ తిరిగి గాడిలో పడుతుంది’ అని దిగ్గజ క్రీడాకారుడు మెకన్రో సలహా ఇచ్చారు.
కంగారు పడకుండా కోలుకోవాలి
ప్రస్తుతం నాదల్ పదో ర్యాంక్‌లో ఉన్నాడు. ఈ పరాజయంతో తన ర్యాంక్ ఇంకా దిగజారొచ్చు. ఇదే జరిగితే పదేళ్ల తర్వాత పదో ర్యాంక్ బయటకు వస్తాడు. టెన్నిస్ ‘ఫ్యాబ్ ఫోర్’లో ఒకడైన నాదల్‌ను ఈ స్థితిలో చూడటం కష్టం. అయితే దీనికే కంగారు పడాల్సిన పనిలేదు. మానసికంగా నాదల్ చాలా దృఢమైన వ్యక్తి. స్పోర్ట్స్ ప్రపంచంలో మెంటల్ ఫిట్‌నెస్‌ను లెక్క వేస్తే తను కచ్చితంగా టాప్-5లో ఉంటాడు.
కావలసిందల్లా పూర్తి ఫిట్‌నెస్ తెచ్చుకోవడం, కోచింగ్ బృందంలో కొత్తదనం తీసుకురావడమే. ప్రతి క్రీడాకారుడి జీవితంలో బ్యాడ్ పీరియడ్ సహజం. నాదల్ కెరీర్‌లో ఇప్పుడదే నడుస్తోంది. దీనిని త్వరగానే అధిగమిస్తాడనే నమ్మకం ఉంది. ఎందుకంటే... నాదల్ నిజమైన చాంపియన్. ఓ పోరాటయోధుడు.
-సాక్షి క్రీడావిభాగం