
అంతులేని శోకం
చేతికి వచ్చిన పంటను తుపాన్ ముంచెత్తితే....
నోటికాడి ముద్దను ఎదుటోడు తన్నుకుపోతే..ఆ శోకం వర్ణణాతీతం...ఇప్పుడు బ్రెజిల్ అలాంటి శోకాన్నే అనుభవిస్తోంది.సొంతగడ్డపై కచ్చితంగా కప్ గెలుస్తామనే నమ్మకంతో ఉన్న సగటు అభిమానికి ఒకే ఒక్క మ్యాచ్‌తో దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఆటలో గెలుపోటములు సహజం.. కానీ ఓడిన విధానమే దారుణం. మైదానంలో తమ ఆటగాళ్లు స్కూల్ పిల్లల కంటే ఘోరంగా ఆడిన వేళ... ప్రత్యర్థులు ఆరు నిమిషాల వ్యవధిలో తమ ఆశలను ఆవిరి చేసిన సమయాన... బ్రెజిల్ అభిమానుల వేదనకు, రోదనకు అంతేలేకుండా పోయింది.
బ్రెజిలియా: సొంతగడ్డపై జర్మనీ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోవడాన్ని బ్రెజిల్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవర్ని కదిలించినా.. ఎవరితో మాట్లాడినా.. ఈ ఓటమి గురించే చర్చ. దాదాపు నెల రోజులుగా ఫుట్‌బాల్ మానియాతో ఊగిపోయిన బ్రెజిల్ ప్రస్తుతం నిర్వేదంతో శోక సంద్రంలో మునిగిపోయింది.
ఈ ఓటమిని తట్టుకోలేక కెప్టెన్ డేవిడ్ లూయిజ్ కన్నీటి పర్యంతమయ్యాడు. తన దేశ ప్రజల ఆకాంక్షను నెరవేర్చలేకపోయానని, నిరాశజనకమైన ఈ రోజు నేర్చుకోవడానికి తొలి మెట్టు అని వ్యాఖ్యానించాడు. ఈ ఓటమి చాలా సిగ్గుపడాల్సిన అంశమని బ్రెజిల్ మీడియా దుమ్మెత్తిపోసింది. మరోవైపు మ్యాచ్ ముగిసిన వెంటనే ప్రధాన కూడళ్లలో కొంత మంది అల్లర్లకు దిగారు. కోపాకబానా బీచ్‌లో అదుపు తప్పిన పరిస్థితిని పోలీసులు చక్కదిద్దారు. ప్రధాన నగరాల్లో అదనపు బలగాలను మోహరించారు. బ్రెజిల్ ఓటమిని తట్టుకోలేక నేపాల్‌లో 15 ఏళ్ల ప్రగ్యా తాపా అనే అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది.
రికార్డు బద్దలు
బ్రెజిల్ ఓటమి ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో రికార్డు స్థాయిలో ట్వీట్స్, పోస్ట్‌లను నమోదు చేసింది. మ్యాచ్ రోజు ట్విట్టర్‌లో 35.6 మిలియన్ ట్వీట్స్ నమోదయ్యాయి. గతంలో సూపర్ బౌల్ సందర్భంగా 25 మిలియన్ ట్వీట్స్ మాత్రమే రికార్డయ్యాయి. ఫేస్‌బుక్‌లో 200 మిలియన్ పోస్ట్‌లు షేర్ చేసుకున్నారు. ఇందులో 66 మిలియన్ల ప్రజలు నేరుగా భాగం పంచుకోవడం కొత్త రికార్డు. జర్మనీ తరఫున ఐదో గోల్ చేసిన ఖెడిరాపై నిమిషంలో 5 లక్షల 80 వేల ట్వీట్స్ వెల్లువెత్తాయి.
‘బ్రెజిల్‌కు నెయ్‌మార్ ఒక్కడే, అర్జెంటీనాకు మెస్సీ ఒక్కడే, పోర్చుగల్‌కు రొనాల్డో ఒక్కడే... కానీ జర్మనీ... ఓ జట్టు’ అనే ట్వీట్ హల్‌చల్ చేసింది.
అత్యంత చెత్త రోజు: స్కొలారీ
‘నా జీవితంలోనే ఇది అత్యంత చెత్త రోజు. మా శక్తి మేరకు రాణించాలని ప్రయత్నించాం. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. ఆరు నిమిషాల్లో చేసిన నాలుగు గోల్స్‌తో మ్యాచ్ తారుమారైంది. ఓటమికి పూర్తి బాధ్యత నాదే. నెయ్‌మార్ ఉన్నా కూడా పెద్ద ప్రభావం ఉండకపోయేదేమో’
- బ్రెజిల్ కోచ్ స్కొలారీ
విశేషాలు
నిరాశ కలిగించింది: రౌసెఫ్
‘ఓ బ్రెజిలియన్‌గా ఈ ఓటమి చాలా నిరాశను కలిగించింది. అభిమానులకు, దేశ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నా’ అని బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.
ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఓ జట్టు ఏడు గోల్స్ చేయడం ఇదే ప్రథమం. ఇప్పటివరకు ఏ జట్టూ ప్రపంచకప్ సెమీఫైనల్లోని తొలి అర్ధభాగంలో ఐదు గోల్స్ సమర్పించుకోలేదు.
12 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌లోని ఒక మ్యాచ్‌లో ఎనిమిది గోల్స్ నమోదు కావడం ఇదే తొలిసారి. చివరిసారి 2002లో జర్మనీ 8-0తో సౌదీ అరేబియాను ఓడించింది.
ప్రపంచకప్ ప్రధాన టోర్నీలో బ్రెజిల్‌కు ఇదే చెత్త ఓటమి. 1998 ఫైనల్లో బ్రెజిల్ 0-3తో ఫ్రాన్స్ చేతిలో ఓడిపోయింది.
ప్రపంచకప్ చరిత్రలోనే తొలి 29 నిమిషాల్లో 5 గోల్స్ చేసిన తొలి జట్టుగా జర్మనీ నిలిచింది. అంతేకాకుండా మొత్తం ప్రపంచకప్‌లలో ఓవరాల్‌గా అత్యధిక గోల్స్ (223) చేసిన జట్టుగా జర్మనీ గుర్తింపు పొందింది. 220 గోల్స్‌తో ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న బ్రెజిల్ రెండో స్థానానికి పడిపోయింది.
ప్రపంచకప్ చరిత్రలో అత్యధికంగా 8 సార్లు ఫైనల్ చేరుకున్న తొలి జట్టుగా జర్మనీ రికార్డు సృష్టించింది. 7 సార్లు ఫైనల్ చేరుకున్న బ్రెజిల్‌ను జర్మనీ వెనక్కినెట్టింది.
1975 తర్వాత బ్రెజిల్ సొంతగడ్డపై అధికారిక మ్యాచ్‌లో ఓడిపోవడం ఇదే తొలిసారి. చివరిసారి బ్రెజిల్ 1975 ‘కోపా అమెరికా కప్’ టోర్నీ సెమీఫైనల్లో పెరూ చేతిలో ఓడిపోయింది. ఫ్రెండ్లీ మ్యాచ్‌ల విషయానికొస్తే 2002లో చివరిసారి బ్రెజిల్ జట్టు సొంతగడ్డపై ఓడింది.
బ్రెజిల్ కోచ్ హోదాలో స్కొలారీకి ఎదురైన తొలి ఓటమి ఇదే.
ప్రపంచకప్ ప్రధాన టోర్నీలో ఓ ఆతిథ్య దేశం జట్టు ఏడు గోల్స్ సమర్పించుకోవడం ఇది తొలిసారేం కాదు. 1954లో ఆతిథ్య స్విట్జర్లాండ్ జట్టు లీగ్ మ్యాచ్‌లో 5-7 గోల్స్ తేడాతో ఆస్ట్రియా చేతిలో ఓడిపోయింది.