లండన్: ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఎంతటి ప్రమాదకర క్రికెటరో మనకు తెలుసు. ఒకసారి క్రీజ్‌లో కుదురుకుంటే పించ్ హిట్టింగ్ బౌలర్లను బెంబేలెత్తిస్తాడు. మరి వార్నర్ తొందరగా పెవిలియన్ పంపడంలో ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఆరితేరిపోయినట్లే ఉన్నాడు. గతేడాది యాషెస్ సిరీస్‌లో వార్నర్‌కు ఏ వ్యూహంతో సిద్ధమై సక్సెస్ అయ్యాడో బ్రాడ్ వివరించాడు. 2019 యాషెస్ సిరీస్‌లో వార్నర్ 10 ఇన్నింగ్స్‌లకు గాను 7 సార్లు బ్రాడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ యాషెస్ సిరీస్‌లో వార్నర్ చేసిన పరుగులు 95. అసలు వార్నర్‌ను ఔట్ చేయడానికి ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసి చుక్కలు చూపించాడో ఆ విషయాన్ని బ్రాడ్ షేర్ చేసుకున్నాడు. (తరానికి ఒకసారే ఇలాంటి దిగ్గజాలు వస్తారు..)
‘వార్నర్ చాలా ప్రమాదకర ఆటగాడు.. నేను దాదాపు 8-9 ఏళ్ల నుంచి వార్నర్ ఎదురైనప్పుడల్లా బౌలింగ్ చేస్తూనే ఉన్నా. వార్నర్‌తో సుదీర్ఘమైన పోటీ ఉండటంతో అతని బలహీనత ఏమిటో కనిపెట్టేశా. నేను చాలా టాలర్ బౌలర్. అందుచేత అతను క్రీజ్‌లో చాలా వెనక్కే ఉంటాడు. అలా ఉండటం వల్ల స్వ్కేర్ డ్రైవ్‌లో కొట్టడం ఈజీ అవుతుంది. నేను బంతిని స్వింగ్ చేసిన ఎక్కువ సందర్భాల్లో వార్నర్ చాలాసార్లు బౌండరీలు కొట్టాడు. దాంతో వ్యూహం మార్చా. ఎట్టిపరిస్థితుల్లోనూ స్వింగ్ బౌలింగ్ వేయకూడదని అనుకున్నాడు.వికెట్ టు వికెట్ బంతులే వేయాలనే వ్యూహం వర్కౌట్ అయ్యింది. వికెట్లే లక్ష్యంగా వార్నర్ బంతులు వేశా. దాంతో బంతిని కట్ చేయబోయే వార్నర్ వికెట్‌ను సమర్పించుకునే వాడు. లార్డ్స్ టెస్టులో వార్నర్ ఔట్ కావడం ద్వారా వరుసగా మూడోసారి నాకు చిక్కాడు. దాంతో వార్నర్‌పై ఇదే వ్యూహం అవలంభించవచ్చనే నమ్మకం వచ్చింది. అలా వార్నర్‌ను హడలెత్తించా’ అని బ్రాడ్ పేర్కొన్నాడు. ఇప్పటివరకూ తన టెస్టు కెరీర్‌లో 138 మ్యాచ్‌లు ఆడిన బ్రాడ్ 485 వికెట్లు సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment