లండన్ : ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ చేసిన ‘యుద్ధం, ద్వేషం’ లాంటి వ్యాఖ్యలపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు మార్కస్ ట్రెస్కోథిక్, జెఫ్రీ బాయ్‌కాట్, మైకెల్ వాగన్‌లు సీరియస్ కాగా.. స్టూవర్ట్ బ్రాడ్ మాత్రం తనకు పిచ్చ హ్యాపీగా ఉందంటున్నాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగనున్న ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ నవంబర్ 23న ప్రారంభం కానుంది. నెలరోజుల ముందుగానే ఆసీస్ ఆటగాళ్లు నోటికి పని చెప్పడాన్ని మేము సానుకూలంగా మార్చుకుంటామన్నాడు.
'యాషెస్ అనగానే ఆసీస్ మాజీ, జట్టు ఆటగాళ్లు మా ఇంగ్లండ్ జట్టుపై తీవ్ర విమర్శలు చేయడం కొత్తేమీ కాదు. వారికి తెలిసిన విద్య అని వదిలేస్తాం. వార్నర్ ప్రతి విషయాన్ని సీరియస్ గా తీసుకునే రకం. కానీ వార్నర్ వ్యాఖ్యల వల్ల ఆట తీవ్రతను మా ఆటగాళ్లకు తెలిపేందుకు ఇదో అవకాశంగా భావిస్తున్నాను. వార్నర్ మాటలు ఇంగ్లండ్ ఆటగాళ్లలో గెలవాలన్ని కాంక్షను రగిల్చేలా మలుచుకుని స్పోర్టివ్ స్పిరిట్ ప్రదర్శిస్తాం. యాషెస్ కు సిద్ధమవుతోన్న మా సహచరులు మరింత సాధన చేసి ఆటద్వారా ఆసీస్ తో తేల్చుకుంటామని' ఇంగ్లండ్ స్టార్ పేసర్ స్టూవర్ట్ బ్రాడ్ వివరించాడు.
వివాదానికి కారణమైన వార్నర్ వ్యాఖ్యలివే..
‘యాషెస్ సిరీస్ మాకు గొప్ప చరిత్ర లాంటిది. మా ప్రతిష్ట ఈ సిరీస్‌తో ముడిపడి ఉంది. త్వరలోనే ఈ యుద్ధంలోకి దిగబోతున్నాం. ఇరుజట్లు కీలకంగా భావిస్తాయి కనుక.. ప్రత్యర్థి ఆటగాళ్లను సాధ్యమైనంతగా ద్వేషించాలి. ఆ జట్టు ఆటగాళ్లపై పైచేయి సాధించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానంటూ’ వార్నర్ చెప్పడంపై ఇంగ్లండ్ మాజీలు భగ్గుమన్నారు. ఆటతో సంబంధాలు పెంచుకోవాలే తప్ప.. ద్వేషం, యుద్ధం అంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సరికాదని సీనియర్లు వార్నర్‌కు చురకలంటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment