మాకంటే భారత్ ముఖ్యమనుకున్నారు
మెల్‌బోర్న్: ఐదేళ్ల నాటి ‘మంకీ గేట్’ వివాదాన్ని ఇటీవలే మళ్లీ రేపిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్... ఈ సారి తన సొంత బోర్డు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)పైనే విమర్శలు గుప్పించాడు. 2008లో జరిగిన ఆ వివాదం సమయంలో తనకు, జట్టు ఆటగాళ్లకు మద్దతు పలకకుండా సీఏ తమను తీవ్రంగా నిరాశ పరిచిందని అతను అన్నాడు. ‘ఎట్ ద క్లోజ్ ఆఫ్ ప్లే’ పేరిట రాసిన తన పుస్తకంలో పాంటింగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
‘ఆ ఉదంతంలో మా బోర్డు స్పందనపై కూడా మాట్లాడాల్సి వస్తోంది. నాతో పాటు మా జట్టు ఆటగాళ్లకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా, మమ్మల్ని పట్టించుకోకుండా భారత్‌తో సంబంధాలే ముఖ్యం అనే తీరుగా సీఏ వ్యవహరించింది. దానిని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను’ అని పాంటింగ్ విమర్శించాడు. మరో వైపు సచిన్ 200వ టెస్టు ఆడనున్న నేపథ్యంలో... అతడిని సాంకేతికంగా అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా పాంటింగ్ ప్రశంసించాడు.