మ్యాచ్ సమయాల్లో మార్పులు
రియో డి జనీరో: వచ్చే ఏడాది జరగనున్న ఫుట్‌బాల్ ప్రపంచకప్ మ్యాచ్‌ల ప్రారంభ సమయాలపై ‘ఫిఫా’ మెట్టు దిగింది. అంతర్జాతీయ ఆటగాళ్ల సంఘం (ఎఫ్‌ఐఎఫ్‌ప్రో) చేసిన ఒత్తిడికి తలొగ్గి ఏడు మ్యాచ్‌ల ప్రారంభ సమయాల్లో మార్పులు చేసింది. కొన్నింటిని ముందుకు... మరికొన్నింటిని వెనక్కి జరిపింది. అధిక ఉష్ణోగ్రతకు ఆటగాళ్లు డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 14న మన్నాస్‌లో ఇంగ్లండ్, ఇటలీ మధ్య మ్యాచ్ రాత్రి 9 గంటలకు బదులుగా సాయంత్రం 6 గంటలకు జరగనుంది.
యూరోపియన్ టెలివిజన్ ప్రసార సంస్థలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే రోజు రెసిఫీలో ఐవరీకోస్ట్, జపాన్‌ల మధ్య మ్యాచ్ రాత్రి 7 గంటలకు కాకుండా 10 గంటలకు నిర్వహించనున్నారు. జూన్ 18న మన్నాస్‌లో మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సిన కామోరూన్, క్రొయేషియా మ్యాచ్‌ను సాయంత్రం ఆరింటికి మార్చారు. రియో డి జనీరోలో స్పెయిన్, చిలీల మధ్య మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు కాకుండా సాయంత్రం 4 గంటలకు మొదలవుతుంది.