స్పెయిన్ గుండె పగిలింది
ఓ కల చెదిరిన వేళ... ఓ ఆశ ఆవిరైన క్షణం... ఫుట్‌బాల్ ప్రపంచం ఊహించని పరిణామం... ఆరేళ్లుగా అన్ని జట్లనూ ఫుట్‌బాల్ ఆడుకుంటూ ప్రపంచాన్ని శాసిస్తున్న స్పెయిన్ బుల్ ఈసారి చతికిలపడింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బ్రెజిల్ వచ్చిన జగజ్జేత ఆశలకు వారం రోజుల్లోపే తెరపడింది. కావలసినంత మంది స్టార్ ఆటగాళ్లున్నా కనీసం గ్రూప్ దశను దాటలేకపోయింది. వరుసగా రెండు దారుణ ఓటములతో స్పెయిన్ అభిమాని గుండె పగిలింది. ప్రపంచ ఫుట్‌బాల్‌లో స్పెయిన్ శకం ‘ముగిసింది’.
రియో డి జనీరో : ప్రత్యర్థిని తక్కువ అంచనా వేస్తే ఫలితం ఎలా ఉంటుందో స్పెయిన్‌కు బాగా తెలిసొచ్చింది. స్టార్ ఆటగాళ్లున్నా.. పక్కా వ్యూహాలతో బరిలోకి దిగినా... సమష్టిగా ఆడటంలో విఫలమై తగిన మూల్యం చెల్లించుకుంది. ఫలితంగా బుధవారం అర్ధరాత్రి గ్రూప్-బిలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో చిలీ చేతిలో 0-2తో ఓడిపోయి తమ పోరాటాన్ని లీగ్ దశకే పరిమితం చేసుకుంది. ప్రపంచకప్ చరిత్రలో తొలిరౌండ్‌లోనే ఓడిన ఐదో డిఫెండింగ్ చాంపియన్ జట్టుగా స్పెయిన్ అపప్రదను మూటగట్టుకుంది. ఇంతవరకు స్పెయిన్ మాదిరిగా ఏ డిఫెండింగ్ చాంపియన్ కూడా తొలి రెండు మ్యాచ్‌ల్లోనే ఓడి టోర్నీ నుంచి నిష్ర్కమించలేదు. ఎడ్వార్డో వర్గాస్ (20వ ని.), అర్న్‌గ్వైజ్ (43వ ని.) చిలీ తరఫున గోల్స్ చేశారు. తాజా విజయంతో 2010 ప్రపంచకప్ గ్రూప్ మ్యాచ్‌లో స్పెయిన్ చేతిలో 1-2తో ఎదురైన పరాజయానికి చిలీ ప్రతీకారం తీర్చుకుంది.
ప్రతి మ్యాచ్‌లో ఆరంభం నుంచే ఆధిపత్యాన్ని చూపే స్పెయిన్ ఈసారి మాత్రం పూర్తిగా తడబడింది. తొలి 45 నిమిషాల్లో చిలీ అటాకింగ్‌ను ఏమాత్రం అడ్డుకోలేకపోయింది. రెండో అర్ధభాగంలో కూడా చిలీ ఛేజింగ్ గేమ్‌తో అదరగొట్టింది. 15వ నిమిషంలో అలోన్సో కొట్టిన షాట్‌ను చిలీ గోల్ కీపర్ బ్రావో అద్భుతంగా అడ్డుకున్నాడు.20వ నిమిషంలో సాంచెజ్.. స్పెయిన్ డిఫెన్స్‌ను ఛేదిస్తూ బంతిని అర్న్‌గ్వైజ్‌కు అందించాడు. అక్కడి నుంచి పాస్ అందుకున్న వర్గాస్ బంతిని నేర్పుగా గోల్ పోస్ట్‌లోకి పంపాడు. దీంతో చిలీ 1-0 ఆధిక్యంలోకి వచ్చింది.27వ నిమిషంలో స్కోరును సమం చేసే అవకాశం స్పెయిన్‌కు వచ్చింది. సిల్వ ఇచ్చిన హెడర్‌ను డిగో కోస్టా డి సర్కిల్ నుంచి లెఫ్ట్ ఫుట్‌తో నెట్‌లోకి పంపే ప్రయత్నం చేశాడు.
43వ నిమిషంలో కొద్ది దూరం నుంచి సాంచెజ్ కొట్టిన ఫ్రీ కిక్‌ను క్యాసిలాస్ బాగానే అడ్డుకున్నా.. బంతిని వదిలిపెట్టాడు. సరిగ్గా ఇదే అవకాశం కోసం ఎదురుచూసిన అర్న్‌గ్వైజ్ రీబౌండ్ అయిన బంతిని క్యాసిలాస్‌ను బోల్తా కొట్టిస్తూ నెట్‌లోకి పంపాడు.రెండో అర్ధభాగంలో అల్బా, కోకీ, డిగో కోస్టా చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. 80వ నిమిషంలో చిలీ డిఫెన్స్‌ను ఛేదించిన ఇనెస్టా... సాంటి కార్లోజాతో సమయోచితంగా ముందుకు దూసుకెళ్లినా బ్రావో అడ్డుపడ్డాడు.మ్యాచ్ చివర్లో గోల్స్ కోసం స్పెయిన్ వీరోచితంగా పోరాడినా... చిలీ సమన్వయం ముందు చిన్నబోయింది.
‘టికీ-టకా’ శైలికి చెక్
ప్రపంచ ఫుట్‌బాల్‌లో మిగతా జట్లతో పోలిస్తే స్పెయిన్ ఆటతీరు భిన్నంగా ఉంటుంది. చిన్న చిన్న పాస్‌లతో ‘టికీ-టకా’ శైలితో ప్రత్యర్థులకు బంతి అందకుండా వేగంగా ముందుకు దూసుకుపోతుంది. అయితే గత ప్రపంచకప్‌లో విజయవంతమైన ఈ శైలి... చరిత్రాత్మక మరకానా స్టేడియం సాక్షిగా ఈసారి స్పెయిన్ కొంప ముంచింది. మ్యాచ్ తొలి అర్ధభాగంలో చిలీ చేసిన పవర్‌ఫుల్ (బ్రూటల్) అటాకింగ్ ముందు బుల్ ఆటలు సాగలేదు.
జ. ఆ.మ్యా. గె. ఓ. డ్రా. పా.
నెదర్లాండ్స్ 2 2 0 0 6
చిలీ 2 2 0 0 6
ఆస్ట్రేలియా 2 0 2 0 0
స్పెయిన్ 2 0 2 0 0
నోట్: జ:జట్లు; ఆ.మ్యా: ఆడిన మ్యాచ్‌లు; గె: గెలుపు; ఓ: ఓటమి; పా: పాయింట్లు.