హ్యాట్సాఫ్..స్వారెజ్‌ | Uruguay star Suarez key role of match | Sakshi
Sakshi News home page

హ్యాట్సాఫ్..స్వారెజ్‌

Published Sat, Jun 21 2014 1:40 AM | Last Updated on Mon, Oct 22 2018 5:58 PM

హ్యాట్సాఫ్..స్వారెజ్‌ - Sakshi

హ్యాట్సాఫ్..స్వారెజ్‌

చెలరేగిన ఉరుగ్వే స్టార్
ఇంగ్లండ్‌పై 2-1తో గెలుపు

 
 
 
 స్కోరు బోర్డు
 
ఉరుగ్వే   :   2
స్వారెజ్   :  39వ,  85వ ని
ఇంగ్లండ్   : 1 రూనీ: 75వ ని.

 
నాలుగు వారాల క్రితం మోకాలికి ఆపరేషన్ జరిగినా... ప్రపంచకప్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. అంతేనా... రెండు సంచలన గోల్స్‌తో ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. అది కూడా మహామహులు ఉన్న ఇంగ్లండ్ జట్టుపై. తనెందుకు స్టార్ అయ్యాడో ఆటతోనే నిరూపించిన స్వారెజ్‌కు హ్యాట్సాఫ్..!
 
సావో పాలో: స్టార్ అంటే ఇతడు.. ఆటంటే ఇదీ అన్నట్లుగా సాగిన  స్వారెజ్ విజృంభణతో ప్రపంచకప్‌లో ఉరుగ్వే అద్భుత విజయం నమోదు చేసింది. గ్రూప్ ‘డి’లో భాగంగా గురువారం తెల్లవారుజామున జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 2-1 తేడాతో గెలుపొంది నాకౌట్ ఆశల్ని సజీవంగా నిలుపుకొంది. 39వ, 85వ నిమిషాల్లో రెండు గోల్స్ నమోదు చేసిన స్వారెజ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకోగా, ఇంగ్లండ్ తరపున నమోదైన ఏకైక గోల్‌ను వేన్ రూనీ 75వ నిమిషంలో సాధించాడు.

    గాయంతో కోస్టారికాతో మ్యాచ్‌కు దూరమైన స్వారెజ్ రాకతో సహా మొత్తం ఐదు మార్పులతో ఉరుగ్వే బరిలోకి దిగింది.  
    9వ నిమిషంలో ఇంగ్లండ్‌కు ఫ్రీ కిక్ లభించినా, దాన్ని గోల్‌గా మలచడంలో రూనీ విఫలమయ్యాడు. 14వ నిమిషంలో ఉరుగ్వేకూ ఈ అవకాశం లభించగా సక్సెస్ కాలేకపోయింది.
    అనంతరం ఇరుజట్ల ఆటగాళ్లు పలుమార్లు బంతిని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నా గోల్ మాత్రం చేయలేకపోయాయి.  31వ నిమిషంలో  గెరార్డ్ ఇచ్చిన పాస్‌ను రూనీ.. హెడర్‌గా మలిచినా బంతి గోల్‌పోస్ట్ పోల్‌కు తగిలి బయటికి వెళ్లింది.
    మ్యాచ్ హోరాహోరీగా సాగుతున్న సమయంలో 39వ నిమిషంలో స్వారెజ్ అద్భుతం చేశాడు. ఇంగ్లండ్ రక్షణ పంక్తిని ఛేదించుకుంటూ కవాని అందించిన బంతిని స్వారెజ్ తలతో గోల్‌పోస్ట్‌లోకి పంపించి ఉరుగ్వే శిబిరంలో ఆనందం నింపాడు.
   41వ నిమిషంలో రూనీ అందించిన పాస్‌తో స్టరిడ్జ్ షాట్ సంధించినా గోల్‌కీపర్ ముస్లేరా అడ్డుకోవడంతో స్కోరును సమం చేసే అవకాశాన్ని ఇంగ్లండ్ కోల్పోయింది. ఆ తరువాత మరో గోల్ నమోదు కాకపోగా ఉరుగ్వే 1-0 ఆధిక్యంతో విరామానికి వెళ్లింది.
►    49వ నిమిషంలో ఉరుగ్వేకు మరో అవకాశం లభించింది. అయితే స్వారెజ్ సంధించిన కార్నర్ కిక్ ను ఇంగ్లండ్ గోల్‌కీపర్ హార్ట్ అడ్డుకున్నాడు.
   ఆ తరువాత ఇంగ్లండ్ ఆటగాళ్లు పలుమార్లు ఉరుగ్వే డిఫెన్స్‌ను దాటుకుంటూ గోల్ కోసం చేసిన ప్రయత్నాలను ముస్లేరా వమ్ముచేశాడు. అయితే 75వ నిమిషంలో డిఫెండర్ గ్లెన్ జాన్సన్ పెనాల్టీ ఏరియాలోకి పంపించిన బంతిని రూనీ గోల్‌గా మలచడంతో ఇంగ్లండ్ 1-1తో స్కోరును సమం చేసింది. రూనీకి ఇది తొలి ప్రపంచకప్ గోల్ కాగా, ఇంగ్లండ్ తరపున 40వ గోల్.

  78వ నిమిషంలో స్టరిడ్జ్ చేసిన మరో ప్రయత్నాన్ని ముస్లేరా అడ్డుకోవడంతో మ్యాచ్ డ్రా దిశగా పయనిస్తున్నట్లు కనిపించింది. అయితే మరో ఐదు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా స్వారెజ్ మళ్లీ అద్భుతం చేశాడు. ఇంగ్లండ్ డిఫెండర్లకు అందకుండా బంతిని వేగంగా తీసుకొచ్చి గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ నెట్‌లోకి పంపించాడు. ఆ తరువాత ఇంగ్లండ్ పోరాటం వృథా కాగా, ఉరుగ్వే సంబరాల్లో మునిగిపోయింది.
 
‘సహచరులను’ ఓడించాడు!

ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్‌లో స్వారెజ్ లివర్‌పూల్‌కు ఆడతాడు. ఈ ఏడాది అత్యధికంగా 31 గోల్స్ చేసి లీగ్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అదే ప్రపంచకప్‌లోనూ కొనసాగించి ఇంగ్లండ్ ఆశలపై నీళ్ల్లుజల్లాడు. లివర్‌పూల్‌కు ఆడుతున్న 8 మంది అతడి సహచరులు ఇంగ్లండ్ జాతీయ జట్టులో ఉండటం విశేషం.
 
 అతను గోల్ చేస్తే గెలిచినట్టే

 ప్రపంచకప్‌లో స్వారెజ్ గోల్ సాధించాడంటే ఉరుగ్వే జట్టు గెలిచినట్లే. గత ప్రపంచకప్ నుంచి ఇది రుజువవుతూ వస్తోంది. 2010లో ఉరుగ్వే రెండు మ్యాచ్‌ల్లో గెలవగా.. రెండింట్లోనూ స్వారెజ్ గోల్సే గెలిపించాయి. ఉరుగ్వే 1-0తో గెలిచిన మెక్సికోపై ఏకైక గోల్, 2-1తో కొరియాపై నెగ్గిన మ్యాచ్‌లో రెండు గోల్స్ స్వారెజ్ సాధించినవే. తాజా ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై 2-1తో ఉరుగ్వే గెలిచిన మ్యాచ్‌లో రెండు గోల్స్‌నూ స్వారెజే సాధించడం విశేషం.
 
నీ వల్లే.. నీ వల్లే... http://img.sakshi.net/images/cms/2014-06/71403295612_Unknown.jpg



ఇంగ్లండ్‌పై రెండు గోల్స్ సాధించి ఉరుగ్వే విజయానికి కారణమైన స్వారెజ్... తాను మళ్లీ రాణించడానికి భార్య సోఫియానే కారణమంటున్నాడు. వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు తన వెన్నంటే నిలిచిన సోఫియాకు వీడియో చాటింగ్‌లో స్వారెజ్ థాంక్యూ చెప్పాడు. ఈ విజయంలో తన పిల్లలు, తల్లి పాత్ర కూడా ఉందన్నాడు.
 

జూనియర్ రూనీ ఏడ్చాడు...


రూనీ తన తొలి ప్రపంచకప్ గోల్ చేసినా అతని కుమారుడు మాత్రం కన్నీటి పర్యంతమయ్యాడు. ఇంగ్లండ్ ఓడిపోవడంతో జూనియర్ రూనీ వెక్కివెక్కి ఏడ్చాడు.http://img.sakshi.net/images/cms/2014-06/81403295739_Unknown.jpg
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement