జపాన్-గ్రీస్ మ్యాచ్ డ్రా
నాటల్: ఫిఫా ప్రపంచకప్‌లో జపాన్-గ్రీస్ మధ్య జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్ డ్రాగా ముగిసింది. నాటల్‌లో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ మ్యాచ్‌లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. కీలకమైన ఈ పోరులో 38వ నిమిషంలో రిఫరీ రెడ్ కార్డ్ చూపడంతో గ్రీస్ కెప్టెన్ కోన్‌స్టాన్టినోస్ మైదానం విడిచి వెళ్లాల్సి వచ్చింది. గ్రీస్ పదిమందితోనే ఆడినా జపాన్ వచ్చిన అవకాశాల్ని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో విఫలమైంది. జపాన్ 11 సార్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడి చేసింది. అయితే వాటిని గ్రీస్ అడ్డుకుంది. మొత్తానికి జపాన్ బంతిని (68 శాతం) తమ ఆధీనంలోనే ఉంచుకున్నా ఆశించిన ఫలితాన్ని మాత్రం సాధించలేకపోయింది.
నాకౌట్‌కు కొలంబియా
జపాన్-గ్రీస్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగియడం కొలంబియాకు కలిసొచ్చింది. గ్రీస్, ఐవరీకోస్ట్‌లపై విజయాలతో ఆరు పాయింట్లను సొంతం చేసుకున్న ఈ దక్షిణ అమెరికా జట్టు గ్రూప్ ‘సి’ నుంచి నాకౌట్ బెర్తును ఖాయం చేసుకుంది. అయితే ఈ గ్రూప్ నుంచి ఐవరీ కోస్ట్ తో పాటు జపాన్, గ్రీస్ జట్లు కూడా నాకౌట్‌కు చేరే అవకాశాలున్నాయి. 24న జరిగే గ్రూప్ ‘సి’ మ్యాచ్‌ల్లో జపాన్ జట్టు కొలంబియాతో, గ్రీస్ జట్టు ఐవరీకోస్ట్‌తో తలపడతాయి. ఇందులో జపాన్, గ్రీస్ గెలిస్తే నాకౌట్ అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఐవరీ కోస్ట్ గెలిస్తే జపాన్, గ్రీస్ జట్లు గ్రూప్ దశలోనే వెనుదిరుగుతాయి.
గ్రూప్ ‘సి’ పాయింట్ల పట్టిక
జ. ఆ.మ్యా. గె. ఓ. డ్రా. పా.
కొలంబియా 2 2 0 0 6
ఐవరీకోస్ట్ 2 1 0 1 3
జపాన్ 2 0 1 1 1
గ్రీస్ 2 0 1 1 1
నోట్: జ:జట్లు; ఆ.మ్యా: ఆడిన మ్యాచ్‌లు; గె: గెలుపు; ఓ: ఓటమి; పా: పాయింట్లు.