నాకౌట్‌కు కోస్టారికా
టలీపై 1-0తో సంచలన విజయం
రెసిఫే: కోస్టారికా జట్టు ప్రపంచకప్‌లో మరో సంచలన విజయం సాధించింది. ఉరుగ్వేపై తమ తొలి మ్యాచ్‌లో గెలుపు గాలివాటం కాదని నిరూపిస్తూ శుక్రవారం మాజీ చాంపియన్ ఇటలీని 1-0తో మట్టి కరిపించింది. 44వ నిమిషంలో కెప్టెన్ బ్రయాన్ రూయిజ్ చేసిన గోల్‌తో టోర్నీలో వరుసగా రెండో విజయం నమోదు చేసింది. దీంతో మరో మ్యాచ్ మిగిలివుండగానే గ్రూప్ ‘డి’ నుంచి మొదటి జట్టుగా నాకౌట్ బెర్తును ఖాయం చేసుకుంది. 1990లో ప్రి క్వార్టర్స్‌కు చేరడం మినహా ప్రపంచకప్‌లో మరెప్పుడూ గ్రూప్ దశ దాటని కోస్టారికా.. ఈ మ్యాచ్‌లో ఇటలీకి ఆరంభం నుంచీ గట్టిపోటీ ఇచ్చింది. ఇటలీని తొలిమ్యాచ్‌లో గెలిపించిన బలోటెలి, ఆండ్రియా పిర్లో వంటి ఆటగాళ్ల దూకుడుకు కళ్లెం వేస్తూ నిలువరించింది.
పలుమార్లు గోల్‌పోస్ట్‌పైకి చేసిన దాడుల్ని కోస్టారికా గోల్‌కీపర్ కేలర్ నవాస్ సమర్థవంతంగా తిప్పికొట్టాడు. మరో నిమిషంలో ప్రథమార్ధం ముగుస్తుందనగా 44వ నిమిషంలో డయాస్ ఇచ్చిన పాస్‌ను రూయిజ్ చాకచక్యంగా హెడర్ గోల్‌గా మలిచి కోస్టారికాకు ఆధిక్యాన్నందించాడు. అనంతరం ద్వితీయార్థంలో 53వ నిమిషంలో లభించిన ఫ్రీ కిక్‌ను ఇటలీ ఆటగాడు పిర్లో అద్భుత షాట్‌గా మలిచినా.. నవాస్ మరోసారి దాన్ని తిప్పికొట్టి వారి ఆశలపై నీళ్లు చల్లాడు. ఆ తరువాత ఇటలీకి మరో అవకాశమే రాలేదు.