థామస్, ఉబెర్ కప్‌లలో క్వార్టర్స్‌కు చేరతాం
జాతీయ కోచ్ గోపీచంద్ విశ్వాసం
న్యూఢిల్లీ: సింగిల్స్ భారత్‌కు ప్రధాన బలమని, స్వదేశంలో జరగనున్న థామస్, ఉబెర్ కప్‌లలో భారత జట్లు కచ్చితంగా క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుతాయని జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నాడు. ఢిల్లీలో ఈ నెల 18 నుంచి 25 వరకు జరగనున్న ఈ టోర్నీల్లో భాగంగా థామస్ కప్‌లో భారత్.. మలేసియా, దక్షిణ కొరియా, జర్మనీలతో తలపడనుంది.
అయితే తాము సింగిల్స్‌లో బలంగా ఉన్నామని, దక్షిణ కొరియాపై మూడు సింగిల్స్‌లోనూ గెలుస్తామని, మలేసియాపై కనీసం రెండు సింగిల్స్, ఒక డబుల్స్ మ్యాచ్‌లో పైచేయి సాధిస్తామని గోపీచంద్ తెలిపాడు. లీ చోంగ్ వీ వంటి ఆటగాడితో పోటీని మినహాయిస్తే మిగిలిన మ్యాచ్‌లు తాము కచ్చితంగా గెలుస్తామన్నాడు. జర్మనీపై సింగిల్స్‌తోపాటు డబుల్స్‌లోనూ అన్ని మ్యాచ్‌ల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ఇక ఉబెర్ కప్‌లో థాయ్‌లాండ్, కెనడా, హాంకాంగ్‌లున్న గ్రూపులో భారత మహిళల జట్టు ఆడనుంది.
అయితే సింగిల్స్‌తోపాటు ఒక డబుల్స్ జంట కూడా గెలుస్తుందని గోపీచంద్ తెలిపాడు. సింగిల్స్‌లోనూ పి.సి.తులసి, అరుంధతిలలో ఒకరు విజయాలను అందించగలరన్నాడు. ఇక సొంతగడ్డపై ఆడనుండడం తమకు ఎంత అనుకూలమో, అంత ప్రతికూలమూ కాగలదని, అయినా అన్నింటినీ అధిగమిస్తామని అన్నాడు.
రెండు టోర్నీల్లోనూ భారత్ క్వార్టర్స్‌కు చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని గోపీచంద్ పేర్కొన్నాడు. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) షట్లర్లకు చక్కని ప్రాక్టీస్ వంటిదని, ఒత్తిడిని అధిగమించి గెలవడమెలాగో ఈ లీగ్ ద్వారా షట్లర్లు అలవాటు చేసుకున్నారని వివరించాడు.
సింగిల్స్‌తో గట్టెక్కుతాం
Published Fri, May 9 2014 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 7:05 AM
Advertisement
Advertisement