
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: అతి త్వరలోనే క్రికెట్ అభిమానులకు ధనాధన్ క్రికెట్ వినోదం లభించనుంది. కరోనా మహమ్మారి కారణంగా దాదాపు నాలుగు నెలలుగా క్రికెట్ కార్యకలాపాలు నిలిచిపోగా... ఈనెల 8న ఇంగ్లండ్, వెస్టిండీస్ తొలి టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్ పునఃప్రారంభమైంది. తాజాగా టి20 ఫార్మాట్‌లో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)కు కూడా లైన్ క్లియర్ అయ్యింది. ప్రేక్షకులు లేకుండా ఈ లీగ్‌ను నిర్వహించుకోవచ్చని ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రభుత్వం నిర్వాహకులకు అనుమతి ఇచ్చింది. దాంతో సీపీఎల్ ఏడో సీజన్ ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 10 వరకు ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని రెండు వేదికల్లో ప్రేక్షకులకు ప్రవేశం లేకుండా జరగనుంది.
మొత్తం ఆరు జట్లు (బార్బడోస్ ట్రైడెంట్స్, గయానా అమెజాన్ వారియర్స్, జమైకా తలవాస్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్, సెయింట్ లూసియా జూక్స్, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్) ఈ లీగ్‌లో టైటిల్ కోసం తలపడనున్నాయి. రెండు సెమీఫైనల్స్, ఫైనల్‌తో కలుపుకొని మొత్తం 33 మ్యాచ్‌లు జరుగుతాయి. సీపీఎల్ నిర్వాహకులకు, ట్రినిడాడ్ ప్రభుత్వానికి జరిగిన ఒప్పందంలో భాగంగా మొత్తం ఆరు జట్లకు చెందిన ఆటగాళ్లు, సిబ్బంది టోర్నీకి బయలుదేరేముందు 14 రోజులు... ట్రినిడాడ్‌లో అడుగుపెట్టాక 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండాలి.
ట్రినిడాడ్ చేరుకున్న వెంటనే అందరికీ కోవిడ్–19 పరీక్షలు చేస్తారు. ఆ తర్వాత 7 రోజులకు, 14 రోజులకు మళ్లీ కోవిడ్–19 పరీక్షలు నిర్వహిస్తారు. ఆరు జట్లూ ట్రినిడాడ్‌లోనే ఒకే హోటల్లో బస చేస్తాయి. టోర్నీకి ముందుగానీ, టోర్నీ మధ్యలోగానీ ఎవరికైనా కోవిడ్–19 పాజిటివ్ వస్తే వారు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాల్సి ఉంటుంది. కరోనా వైరస్ కారణంగా మార్చిలోనే ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రభుత్వం తమ దేశ సరిహద్దులను మూసివేసింది. సీపీఎల్ కారణంగా బయటి వారిని తొలిసారి దేశంలోకి అనుమతి ఇవ్వనుంది. ట్రినిడాడ్‌లో ఇప్పటివరకు కరోనా తీవ్రత తక్కువగానే ఉంది. జూలై 9 వరకు ట్రినిడాడ్‌లో కేవలం 133 కోవిడ్–19 పాజిటివ్ కేసులు రాగా, ఎనిమిది మంది మాత్రమే మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment