దాదాపు 116 రోజుల విరామం తర్వాత ఓ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ మళ్లీ ప్రారంభమైంది. కొద్దిరోజుల క్రితం క్రికెట్ బంతుల ద్వారా కరోనా సోకవచ్చనే ప్రధాని బోరిస్ జాన్సన్ చేసిన ప్రకటన ఫ్యాన్స్, ప్లేయర్లకు ఆగ్రహం తెప్పించింది. అదే సమయంలో ఏయే ఆటలు కోవిడ్–19ను వ్యాప్తి చేస్తాయన్న అనుమానాన్ని రేకెత్తించింది. అయితే, యూకే ప్రభుత్వం పబ్స్, రెస్టారెంట్లకు ఇప్పటికే అనుమతినిచ్చింది. వీటితో పోల్చితే ఆటగాళ్లు ఒకరికి ఒకరు దూరంగా నిలబడి ఆడే క్రికెట్లో కరోనా వ్యాప్తి చెందడం అంతసులువు కాదు. (క్రికెట్‌కు నమో నమః)
ఇకపోతే క్రికెట్ బంతి ద్వారా కరోనా సోకే అవకాశాలు లేకపోలేదు. కానీ ఏ మేరకు అన్న విషయంపై పరిశోధనలు జరగాల్సివుంది. అయితే, ప్రధాని జాన్సన్ క్రికెట్‌ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ ప్రాధాన్యతను ఇక్కడ మరువకూడదు. సలహాకు, ఆధారాలకు మధ్య.. అగాధం అంత తేడా ఉంటుంది.
క్రికెట్ బంతికి.. మిగతా బంతులకు తేడా ఏంటి?
క్రికెట్ బంతి చుట్టూ లెదర్‌తో చుడతారు. బౌలర్లు సీమ్ రాబట్టేందుకు గరుకుగా రూపుదిద్దుతారు. ఓ క్రికెట్ బంతి సీమ్ కావడం చాలా ముఖ్యం. ఆటలోని రసపట్టును ప్రేక్షకుడు ఆనందించే భాగంలో ఇది కూడా ఒకటి. కేవలం సీమ్‌తో బౌలర్లు, బ్యాట్స్‌మన్‌ను ముప్పతిప్పలు పెట్టిన సందర్భాలు బోలెడు.
బంతి నుంచి సీమ్ రాబట్టేందుకు బౌలర్లు ఒక వైపు బాగా పాలిష్ చేస్తారు. ఇందుకోసం ఉమ్మి లేదా చెమట తడిని వాడతారు. ఫలితంగా బంతిని విసిరినప్పుడు గరుకుగా ఉన్న భాగం వైపు తిరుగుతుంది. ప్రస్తుతం చిక్కంతా ఇక్కడే వచ్చి పడింది. కరోనా సోకిన వ్యక్తి బంతికి ఉమ్ముని రాస్తే, దాన్ని తాకిన మరో వ్యక్తికి వైరస్ సోకే ప్రమాదం ఉంది. ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకునే మిగతా బంతులతో పోల్చితే, క్రికెట్ బంతి వల్ల ప్రమాదం పొంచివుందని వ్యాఖ్యానించారు. మరి పరిశోధనలు ఏం చెబుతున్నాయి?('కెప్టెన్సీ కంటే జట్టు గెలుపే ముఖ్యం')
ఉపరితలాలపై కరోనా
రాగి, కార్డు బోర్డు, స్టెయిన్లెస్ స్టీల్, ప్లాస్టిక్, ఏరోసోల్‌లో కరోనా వైరస్ ఎంతసేపు బతికుంటుందన్న దానిపై యూరప్‌కు చెందిన బృందం పరిశోధన చేసింది. ఉష్ణోగ్రత 21 డిగ్రీల నుంచి 23 డిగ్రీల మధ్య సార్స్–సీఓవీ–2 వైరస్.. ప్లాస్టిక్, స్టీల్‌పై 72 గంటలపాటు మనగలుగుతోందని సదరు బృందం తేల్చింది. ఆ తర్వాత ఆయా పదార్థాలపై వైరస్ ప్రాబల్యం కొన్ని వేల రెట్లు తగ్గినట్లు తెలిపింది.
రాగి మీద నాలుగు గంటల తర్వాత వైరస్ జాడే కనిపించలేదని చెప్పింది. కార్డు బోర్డుపై 24 గంటల తర్వాత వైరస్ ఆనవాళ్లు లేవని, ఏరోసోల్‌లో 1 గంటా 20నిమిషాల తర్వాత వైరస్ చనిపోయినట్లు వెల్లడించింది. పేపర్ లేదా టిష్యూపై మూడు గంటల తర్వాత, బట్టలు లేదా చెక్కపై 48 గంటల తర్వాత కోవిడ్ వైరస్ జాడ కనిపించలేదని మరో పరిశోధనలో తేలింది.
ఈ పరిశోధనలను పటిష్ట భద్రతలు కలిగిన పరిశోధనాశాలల్లో నిర్వహించారు. అయితే, వాస్తవ ప్రపంచంలో కరోనా వైరస్ ఏ వస్తువుపై ఎంత కాలం జీవించి ఉంటుందో ప్రత్యక్షంగా ఎవరూ పరీక్షించలేదు. ఈ దిశలో ప్రయోగాలు ఇంకా జరగాల్సివుంది. ఓ చైనా ఆసుపత్రి నిర్వహించిన పరిశోధనలో రోజూవారీ వస్తువుల మీద కూడా వైరస్ ఉంటుందని తేలింది. తమ వద్దకు వచ్చిన కేసుల్లో ప్రింటర్లు, హ్యాండ్ శానిటైజర్ల ద్వారా వైరస్ సోకిన వారు 20 శాతం, కీబోర్డుల ద్వారా సోకిన వారు 17 శాతం, తలుపు గడుల ద్వారా సోకిన వారు 16 శాతం ఉన్నారని పేర్కొంది.
నిజానికి ఇవి చాలా ఆసక్తి కలిగించే ఫలితాలే. కానీ, వీటితో క్రికెట్ బంతిని ఎలా పోల్చుతారు? సరైన నిర్ధారణ పరీక్షలు లేకుండా క్రికెట్ బంతి కరోనాకు వాహకంగా పని చేస్తుందన్న ప్రధాని జాన్సన్ కామెంట్ తామరాకు మీద నీటి బొట్టులా జారిపోతుందంతే. ఇంతకూ క్రికెట్ బంతిపై కరోనా ప్రయోగాలు ఎలా సాగితే బావుంటుంది?
పరిశోధన పెద్ద సవాలే
‘మిగతా ఆటలతో పోల్చితే క్రికెట్ బంతి కరోనా వైరస్‌ను అధికంగా వ్యాప్తి చేస్తుందా?’ అనే ప్రశ్న పరిశోధనకు బావుంటుంది. కరోనా వైరస్ ఓ శ్వాసకోశ సంబంధిత జబ్బు. దీనిపై పరిశోధన కోసం క్రికెటర్ల ముక్కు, గొంతుల్లో రెండు చుక్కల మెడికల్ రంగును వేయాలి. ఆ తర్వాత వారితో ఆట ఆడించి బంతిపై ఏ రంగు ఎక్కువగా ఉందో చూడాలి. ఆటలో బంతి ఎక్కువ సేపు కీపర్, బౌలర్, కెప్టెన్, అంపైర్ల చేతిలో ఉంటుంది. కాబట్టి ప్రతి ప్లేయర్‌కు ప్రత్యేక రంగును వేయాలి. ఇదే సమయంలో ఇతరులకు వేసిన రంగు ఏదైనా వేరే ప్లేయర్‌కు అంటుకుందా అనే విషయాన్నీ గమనించాలి.
కేవలం రంగు అంటుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తి జరుగుతోందని నిర్ధారించుకోకూడదు. ఆ రంగులో వైరస్ జాడ ఉందా అన్న విషయాన్ని పరీక్షించి నిర్ధారించుకోవాలి. ఈ విషయాన్ని ప్రాక్టికల్‌గా తెలుసుకోవాలంటే ఓ క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించడానికి అనుమతినిచ్చి, ఆట ముగిసిన తర్వాత ప్లేయర్లకు పరీక్షలు చేయాలి. దీని వల్ల మిగతా ఆటల్లా క్రికెట్లో వైరస్ వ్యాప్తి చెందుతుందో లేదో తెలుసుకోవచ్చు.
బంతిపై కరోనా జాడను నిర్ధారించడానికి ఉన్న మరో ఆప్షన్, బంతిపై వైరస్‌ను ఉంచి, పీపీఈ కిట్లు వేసుకుని ఆట ఆడటం. దీని ద్వారా ఆట ముగిసిన తర్వాత బంతిపై వైరస్ ఎంత మొత్తంలో బతికున్నదనే విషయం వెల్లడవుతుంది. ఆ తర్వాత రివ్యూలు వగైరా ముగించుకుని కచ్చితమైన ఆధారాలతో ప్రధాని జాన్సన్ మాట్లాడివుంటే అందరూ ఆహ్వానించేవారు.
ఒకవేళ బంతితో కరోనా వస్తుందని నిరూపితమైతే, క్రికెటర్లు సీమ్ కోసం ఉమ్మికి బదులు హ్యాండ్ శానిటైజర్లు వాడితే బావుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment