
న్యూఢిల్లీ : దాదాపు ఏడాదికి పైగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన దక్షిణాఫ్రికా స్పీడ్ స్టార్ డేల్ స్టెయిన్‌కు భారత్‌పై రాణించడం అంత సులువైన విషయం కాదని భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. గతేడాది ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ సందర్భంగా స్టెయిన్ భుజానికి గాయమైంది. దీంతో ఏడాదిగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు.
‘పదేళ్లు తన బౌలింగ్‌తో అద్బుతంగా రాణించిన స్టెయిన్‌కు పునరాగమనం అంత ఈజీ కాదు. జింబాంబ్వేతో జరుగుతున్న నాలుగురోజుల ప్రయోగాత్మక టెస్టు.. భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌ను ప్రతిబింబించలేదు.’ అని బజ్జీ దక్షిణాఫ్రికాలో భారత్ పర్యటనపై తన అభిప్రాయం తెలిపాడు.
‘భారత బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. చాలా నాణ్యమైన బ్యాట్స్‌మెన్ భారత జట్టులో ఉన్నారు. మురళి విజయ్, చతేశ్వర పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, రోహిత్ శర్మలతో కూడిన పటిష్ట బ్యాటింగ్ లైనప్‌ను ఎదుర్కోవడం స్టెయిన్, మోర్కెల్‌లకు పెద్ద సవాలే.’ అని హర్బజన్ చెప్పుకొచ్చాడు. ఇక ఆరో స్థానంలో ఆడుతున్న పాండ్యాకు బదులు రోహిత్‌ను చూడాలనుందన్న బజ్జీ .. పాండ్యా బెస్ట్ ఆల్‌రౌండరే కానీ రోహిత్ పూర్తిస్థాయి బ్యాట్స్‌మన్ అన్నాడు. ఇక జట్టులో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్‌కు చోటు దక్కకపోవచ్చని, భారత్ ముగ్గురు పేసర్లను బరిలోకి దించే అవకాశం ఉండటమే దీనికి కారణమని పేర్కొన్నాడు.