లెక్క సరిచేశారు
► కోల్‌కతాపై ఢిల్లీ గెలుపు
► నాయర్, బిల్లింగ్స్ అర్ధసెంచరీలు
► బ్రాత్‌వైట్ ఆల్‌రౌండ్ ప్రదర్శన
► ఉతప్ప శ్రమ వృథా
న్యూఢిల్లీ: సీజన్ ఆరంభంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఎదురైన పరాభావానికి ఢిల్లీ డేర్‌డెవిల్స్ ప్రతీకారం తీర్చుకుంది. ఘనమైన ఆరంభం లభించకున్నా భారీ లక్ష్యాన్ని నిర్దేశించి... అద్భుతమైన బౌలింగ్‌తో జహీర్ ఖాన్ బృందం మ్యాచ్ గెలిచి లెక్క సరిచేసింది. దీంతో ఐపీఎల్-9లో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ 27 పరుగుల తేడాతో కోల్‌కతాపై గెలి చింది. టాస్ గెలిచి కోల్‌కతా ఫీల్డింగ్ ఎంచుకోగా, ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 186 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (50 బంతుల్లో 68; 9 ఫోర్లు, 1 సిక్స్), బిల్లింగ్స్ (34 బంతుల్లో 54; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. తర్వాత కోల్‌కతా 18.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. రాబిన్ ఉతప్ప (52 బంతుల్లో 72; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా మిగతా వారు విఫలమయ్యారు. కోల్‌కతా చివరి ఐదు వికెట్లను కేవలం ఎనిమిది పరుగుల వ్యవధిలో కోల్పోవడం గమ నార్హం.
టాప్ విఫలం...
ఆరంభంలో చెలరేగిన కోల్‌కతా బౌలర్లు.. 32 పరుగులకే ఢిల్లీ టాప్-3 బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు చేర్చారు. ముఖ్యంగా డికాక్ అవుట్ కావడం ఢిల్లీ స్కోరుపై ప్రభావం చూపింది. కానీ నాయర్, బిల్లింగ్స్ ఈ ఒత్తిడి నుంచి తొందరగానే తేరుకున్నారు. వికెట్లను కాపాడుకుంటూనే స్ట్రయిక్ రొటేషన్‌తో రన్‌రేట్‌ను పెంచారు. దీంతో పవర్‌ప్లేలో 37/3తో ఉన్న ఢిల్లీ తొలి 10 ఓవర్లు ముగిసేసరికి 70/3కు చేరింది. 12వ ఓవర్ నుంచి ఈ ఇద్దరు జోరు పెంచడంతో స్కోరు బోర్డు వేగంగా కదలింది. 17వ ఓవర్‌లో ఉమేశ్ మూడు బంతుల తేడాలో నాయర్, మోరిస్ (0)లను అవుట్ చేసి ఝలక్ ఇచ్చాడు. నాయర్, బిల్లింగ్స్ నాలుగో వికెట్‌కు 105 పరుగులు జత చేశారు. ఈ దశలో వచ్చిన బ్రాత్‌వైట్ (11 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. సిక్సర్లు, బౌండరీలు బాదడంతో ఆరో వికెట్‌కు కేవలం 12 బంతుల్లోనే 37 పరుగులు జతయ్యాయి. ఓవరాల్‌గా చివరి నాలుగు ఓవర్లలో 55 పరుగులు రావడంతో ఢిల్లీ భారీ స్కోరు చేసింది.
ఉతప్ప మినహా....
లక్ష్య ఛేదనలో ఓ ఎండ్‌లో ఉతప్ప మెరుగ్గా ఆడినా.. రెండో ఎండ్‌లో సహచరులు పెవిలియన్ బాటపట్టారు. మూడో ఓవర్‌లో గంభీర్ (6)తో మొదలైన వికెట్ల పతనం చివరి వరకు కొనసాగింది. 8 ఓవర్లు ముగిసేసరికి నైట్‌రైడర్స్ 58 పరుగులకు మూడు వికెట్లు కోల్పోవడంతో కోలుకోలేకపోయింది. ఈ దశ లో సూర్యకుమార్ (13 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్) కాసేపు ఆడే ప్రయత్నం చేశాడు. ఉతప్పతో కలిసి నాలుగో వికెట్‌కు 36 పరుగులు జత చేశాడు. 13వ ఓవర్‌లో వంద పరుగులకు చేరుకున్న కోల్‌కతా ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు చేజార్చుకుంది. 15వ ఓవర్‌లో భారీ సిక్సర్‌తో అర్ధసెంచరీ పూర్తి చేసిన ఉతప్పకు తోడుగా రసెల్ బ్యాట్ ఝుళిపించాడు.ఇక 24 బంతుల్లో 51 పరుగులు చేయాల్సిన దశలో ఐదు బంతుల తేడాలో రసెల్ (12 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్స్), హోల్డర్ (0), ఉతప్ప అవుటయ్యారు. దీంతో విజయసమీకరణం 12 బంతుల్లో 31గా మారింది. 19వ ఓవర్‌లో వరుస బంతుల్లో నరైన్ (4), ఉమేశ్ (2) అవుట్‌కావడంతో 9 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ విజయాన్ని అందుకుంది. బ్రాత్ వైట్, జహీర్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
స్కోరు వివరాలు
ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) హాగ్ (బి) రసెల్ 1; శ్రేయస్ ఎల్బీడబ్ల్యు (బి) రసెల్ 0; శామ్సన్ ఎల్బీడబ్ల్యు (బి) నరైన్ 15; కరుణ్ నాయర్ ఎల్బీడబ్ల్యు (బి) ఉమేశ్ 68; బిల్లింగ్స్ (బి) ఉమేశ్ 54; మోరిస్ (బి) ఉమేశ్ 0; బ్రాత్‌వైట్ (సి) నరైన్ (బి) రసెల్ 34; పంత్ రనౌట్ 4; షమీ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 186.
వికెట్ల పతనం: 1-1; 2-2; 3-32; 4-137; 5-137; 6-174; 7-182; 8-186.
బౌలింగ్: రసెల్ 4-0-26-3; హోల్డర్ 4-0-35-0; నరైన్ 3-0-22-1; ఉమేశ్ 3-0-33-3; హాగ్ 4-0-39-0; చావ్లా 2-0-24-0.
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) నాయర్ (బి) మోరిస్ 72; గంభీర్ (సి) శ్రేయస్ (బి) జహీర్ 6; చావ్లా ఎల్బీడబ్ల్యు (బి) జహీర్ 8; యూసుఫ్ పఠాన్ (సి) మిశ్రా (బి) బ్రాత్‌వైట్ 10; సూర్యకుమార్ (సి) శ్రేయస్ (బి) బ్రాత్‌వైట్ 21; సతీష్ (సి) మోరిస్ (బి) బ్రాత్‌వైట్ 6; రసెల్ (సి అండ్ బి) మిశ్రా 17; హోల్డర్ రనౌట్ 0; ఉమేశ్ (సి) మోరిస్ (బి) జహీర్ 2; నరైన్ రనౌట్ 4; హాగ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం: (18.3 ఓవర్లలో ఆలౌట్) 159.
వికెట్ల పతనం: 1-21; 2-33; 3-58; 4-94; 5-107; 6-151; 7-152; 8-153; 9-159; 10-159.
బౌలింగ్: జహీర్ 3.3-0-21-3; షమీ 4-0-33-0; మోరిస్ 3-0-19-1; బ్రాత్‌వైట్ 4-0-47-3; మిశ్రా 4-0-36-1.