
వార్నర్ విధ్వంసం, బెంగళూరుకు భారీ లక్ష్యం
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తో జరగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసి బెంగళూరుకు భారీ లక్ష్యాన్ని ముందుంచింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. కేవలం 50 బంతుల్లోనే 9 ఫోర్లు, 5 సిక్సర్లు బాదిన ఓపెనర్ వార్నర్ స్కోరును పెంచే క్రమంలో ఔటయ్యాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన వార్నర్ తొలి వికెట్ కోల్పోయిన తర్వాత జోరు పెంచాడు. ధావన్(11) ఔటైన తర్వాత క్రీజులోకొచ్చిన విలియమ్సన్(50 పరుగులు; 7 ఫోర్లు) తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
విలియమ్సన్ కూడా చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరు వేగాన్ని పెంచే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు 124 పరుగుల భారీ భాగస్వాయ్యాన్ని జత చేశారు. చివర్లో త్వరత్వరగా వికెట్లు చేజార్చుకోవడంతో 200 మార్కును చేరుకోలేక పోయింది. ఆఖరి ఓవర్లలో హెన్రిక్స్ (30 నాటౌట్, 13 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు)మెరుపులు మెరిపించాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసిన వాట్సన్ ఆ ఓవర్లో కేవలం 6 పరుగులే ఇవ్వడంతో రెండు వందల పరుగులకు కొన్ని అడుగుల దూరంలో నిలిచింది. బెంగళూరు బౌలర్లలో రిచర్డ్ సన్ రెండు వికెట్లు, వాట్సన్, శంషి చెరో వికెట్ తీశారు.