
నంబర్‌వన్ వార్నర్
► ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్
► మూడో స్థానానికి కోహ్లి
దుబాయ్: ఆస్ట్రేలియా సంచలన బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్‌లో తొలిసారి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇప్పటి వరకు నంబర్‌వన్ గా ఉన్న ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా–861 పాయింట్లు)ను వెనక్కి నెట్టి వార్నర్ (880) టాప్ ర్యాంక్‌లోకి వచ్చాడు. 2016 ఆరంభం నుంచి అత్యద్భుత ఫామ్‌లో ఉన్న వార్నర్... ఈ సమయంలో 28 వన్డేల్లో 65 సగటుతో 1,755 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది సెంచరీలు, నాలుగు అర్ధ సెంచరీలు ఉండటం విశేషం.
భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఒక స్థానం దిగజారి మూడో ర్యాంక్ (852)కు పడిపోయాడు. బ్యాట్స్‌మెన్ జాబితాలో టాప్–20లో మరో ఇద్దరు భారత ఆటగాళ్లు ధోని (13వ), శిఖర్ ధావన్ (15వ) ఉన్నారు. వన్డే బౌలర్ల జాబితాలో ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, భారత్ నుంచి అత్యుత్తమంగా అక్షర్ పటేల్ 12వ స్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్లలో షకీబ్ అల్ హసన్ తన టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు.