భారత్‌లో ఇదే తొలిసారి | Decks almost cleared for Delhi to host fourth Test | Sakshi
Sakshi News home page

భారత్‌లో ఇదే తొలిసారి

Published Thu, Nov 19 2015 1:05 AM | Last Updated on Sun, Sep 3 2017 12:40 PM

భారత్‌లో ఇదే తొలిసారి

భారత్‌లో ఇదే తొలిసారి

బెంగళూరు: భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టులో కొత్త రికార్డు నమోదైంది. అయితే అదేదో పరుగులు, వికెట్ల పరంగా కాదు. భారత గడ్డపై ఒక టెస్టు మ్యాచ్ నాలుగు రోజుల పాటు వర్షం బారిన పడటం ఇదే మొదటి సారి కావడం విశేషం. తొలి రోజు మాత్రమే ఆట జరగ్గా... ఆ తర్వాత వరుసగా నాలుగు రోజుల పాటు భారీ వర్షంతో ఒక్క బంతి వేయడం కూడా సాధ్యం కాలేదు. బుధవారం ఉదయం 11.30 గంటలకు చిన్నస్వామి మైదానాన్ని అంపైర్లు పరిశీలించారు.

ఉదయం చిరుజల్లులే పడినా...రాత్రి కురిసిన వర్షానికి గ్రౌండ్ చిత్తడిగా మారింది. ఇలాంటి స్థితిలో ఆట నిర్వహిస్తే అవుట్‌ఫీల్డ్‌లో ఆటగాళ్లకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని భావించి ఐదో రోజు ఆటను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో ఈ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. నాలుగు టెస్టుల ఈ సిరీస్‌లో ప్రస్తుతం భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ నెల 25నుంచి నాగ్‌పూర్‌లో మూడో టెస్టు జరుగుతుంది.
 
భారత్‌లో రెండో ‘చిన్న’ మ్యాచ్
బెంగళూరు టెస్టులో మొత్తం 81 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. దక్షిణాఫ్రికా 59 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌట్ కాగా...అనంతరం భారత్ 22 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 81 పరుగులు చేసింది. 1995లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య చెన్నైలో జరిగిన రెండో టెస్టులో 71.1 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. అయితే రెండు జట్లు కనీసం ఒక ఇన్నింగ్స్ ఆడిన మ్యాచ్‌లలో మాత్రం ఇదే అన్నింటికన్నా చిన్న మ్యాచ్.

భారత గడ్డపై వర్షం కారణంగా కనీసం మూడు రోజులు ఆటకు అంతరాయం కలగడం పదేళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2005లో భారత్, శ్రీలంక మధ్య చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో (ధోని తొలి టెస్టు) తొలి మూడు రోజుల ఆట పూర్తిగా రద్దయింది.
 
భారత్ జోరుకు బ్రేక్
రెండో టెస్టుకు ముందు భారత్ సొంతగడ్డపై వరుసగా ఏడు టెస్టుల్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్ ‘డ్రా’ కావడంతో ఆ జోరుకు బ్రేక్ పడింది. గతంలో 1988-94 మధ్య భారత్ సొంతగడ్డపై వరుసగా పది టెస్టులు గెలిచింది.
 
మార్పుల్లేని జట్టు
దక్షిణాఫ్రికాతో జరిగే తర్వాతి రెండు టెస్టులకు సెలక్టర్లు భారత జట్టును ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న జట్టులో ఎలాంటి మార్పులూ చేయలేదు. రిజర్వ్ ఆటగాళ్లు సహా తొలి రెండు టెస్టులకు అందుబాటులో ఉన్న 17 మందినే ఎంపిక చేశారు. బెంగళూరు టెస్టుకు ముందు ఉమేశ్, భువనేశ్వర్, గుర్‌కీరత్‌లను రంజీ ట్రోఫీ మ్యాచ్‌ల కోసం పంపించినా... చివరి రెండు టెస్టు జట్టు కోసం ప్రకటించిన జాబితాలో వారి పేర్లు కూడా ఉంచారు.

ఢిల్లీలోనే నాలుగో టెస్టు
వివాదాలు, తర్జనభర్జనల అనంతరం భారత్, దక్షిణాఫ్రికా నాలుగో టెస్టు వేదికగా న్యూఢిల్లీనే ఖరారైంది. డిసెంబర్ 3నుంచి జరిగే ఈ మ్యాచ్ నిర్వహణ కోసం ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)కు వెంటనే తగిన అనుమతులు మంజూరు చేయాలని  ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ను హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వానికి డీడీసీఏ రూ. 24.46 కోట్ల వినోదపు పన్ను బాకీ ఉండటంతో ఈ మ్యాచ్ నిర్వహణ సందేహంలో పడింది. నవంబర్ 17లోగా అనుమతులు తెచ్చుకోవాలని, లేదంటే మ్యాచ్‌ను పుణేలో నిర్వహిస్తామని గతంలో బీసీసీఐ హెచ్చరించింది. కోట్లా మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌కు పరిశీలకుడిగా జస్టిస్ ముకుల్ ముద్గల్‌ను కోర్టు నియమించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement