
నాయర్, బిల్లింగ్స్, బ్రాత్ వైట్..
ఢిల్లీ: తొలి ఓవర్ లో రెండు వికెట్లు.. 32 పరుగులకే మూడు వికెట్లు.. అది కూడా పవర్ ప్లే ముగియకుండానే.. ఐయ్యర్ (0), డీ కాక్ (1), సంజూ శాంసన్(15) స్వల్ప వ్యవధిలో క్యూకట్టారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో శనివారం కోల్ కతా నైట్ రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆదిలో ఆడిన తీరు.
అయితే ఆ తరువాత కరుణ్ నాయర్ (68;50 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్), బిల్లింగ్స్(54;34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), బ్రాత్ వైట్(34;11బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు)లు ఎదురుదాడికి దిగడంతో ఢిల్లీ 187 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్ ను అందుకున్న కోల్ కతా బౌలర్ ఆండ్రీ రస్సెల్ రెండు వికెట్లు తీసి ఢిల్లీకి షాకిచ్చాడు. ఐయ్యార్ డకౌట్ గా పెవిలియన్ కు చేరగా, డీకాక్ ఒక పరుగుకే పరిమితమయ్యాడు. ఆ తరువాత స్వల్ప వ్యవధిలో సంజూ శాంసన్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. దీంతో ఢిల్లీ వంద పరుగుల మార్కును చేరడం కూడా కష్టమే అనిపించింది.
ఆ సమయంలో కేకే నాయర్, బిల్లింగ్స్లు చెలరేగిపోయారు. ఈ జోడీ నాల్గో వికెట్ 105 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఢిల్లీ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. ఇదే క్రమంలో వారిద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆపై బ్రాత్ వైట్ కూడా దాటిగా బ్యాటింగ్ చేయడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్లలో రస్సెల్, ఉమేష్ యాదవ్ లు తలో మూడు వికెట్లు సాధించారు.