
కోహ్లికి షాక్.. రికీ టీమ్ కెప్టెన్‌గా ధోని
ఎవరెన్ని చెప్పినా ఎంఎస్ ధోని ఉత్తమ కెప్టెన్ అని రుజువవుతూనేవుంది.
మెల్‌బోర్న్: ఎవరెన్ని చెప్పినా ఎంఎస్ ధోని ఉత్తమ కెప్టెన్ అని రుజువవుతూనేవుంది. అతడిని మించిన కెప్టెన్ లేడని విదేశీ క్రికెటర్లు కూడా ఒప్పుకుంటున్నారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాటింగ్ తన ఆల్‌టైమ్ ఐపీఎల్ ఎలెవన్ జట్టు కెప్టెన్‌గా ధోనిని ఎంచుకున్నాడు. రికీ టీమ్‌లో ఏడుగురు ఇండియన్ ప్లేయర్స్, నలుగురు విదేశీ క్రికెటర్లకు చోటు దక్కింది. ఆశ్చర్యకరంగా తన డ్రీమ్ టీమ్‌లో స్పిన్నర్ అమిత్ మిశ్రాను తీసుకున్నాడు. ఐపీఎల్ మిశ్రాకు మంచి రికార్డు ఉందని పాంటింగ్ గుర్తు చేశాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, ఆశిష్ నెహ్రా, క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్, డ్వేన్ బ్రావొ, లలిత్ మలింగ.. రికీ జట్టులో ఇతర సభ్యులు. ఆటగాడిగా, కెప్టెన్‌గా జట్టును గెలిపించే సత్తా ధోనికి ఉందని రికీ పాంటింగ్ తెలిపాడు.
టీమిండియా నాయకుడు కోహ్లిని కాకుండా ధోనిని ఎందుకు కెప్టెన్‌గా ఎంచుకున్నాననే దాని గురించి పాటింగ్ వివరిస్తూ.. ‘ధోని ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతాడు. అతడు క్రీజ్‌లో ఉంటే తప్పకుండా జట్టును గెలిపించి తీరతాడు. తన బ్యాటుతో ఎన్నోసార్లు అతడీ విషయాన్ని రుజువు చేశాడు. అతడికి అపారమైన అనుభవం ఉంది. కీపింగ్‌లోనూ సత్తా చాటాడ’ని తెలిపాడు. ఇంతకుముందు ఆస్ట్రేలియా ఆటగాడు మైఖేల్ క్లార్క్ ప్రకటించిన తన ఐపీఎల్ డ్రీమ్ టీమ్‌లోనూ ధోనికి స్థానం లభించని సంగతి క్రికెట్ అభిమానులకు గుర్తుండే ఉంటుంది.