ధోనీకి సొంత రాష్ట్రంలో ఎంత కష్టం?
జార్ఖండ్ డైనమైట్ అని పేరున్న మహేంద్రసింగ్ ధోనీ.. దేశంలోనే ఇప్పటివరకు అత్యంత విజయవంతమైన కెప్టెన్.
జార్ఖండ్ డైనమైట్ అని పేరున్న మహేంద్రసింగ్ ధోనీ.. దేశంలోనే ఇప్పటివరకు అత్యంత విజయవంతమైన కెప్టెన్. కానీ, అతడికి తన సొంత రాష్ట్రంలో క్రికెట్ అసోసియేషన్‌లో ఓటు వేయడానికి అర్హత లేదు. జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (జేఎస్‌సీఏ) గౌరవ సభ్యత్వం ఇచ్చింది గానీ, దానివల్ల ధోనీకి ఓటు వేసే హక్కు లేకుండా పోయింది. సంఘానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే హక్కుగానీ, ఓటు వేసే హక్కు గానీ ధోనీకి లేకపోవడం పట్ల జేఎస్‌సీఏ సభ్యుడు సురేష్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర క్రికెట్ సంఘంలో పలువురు ప్రభుత్వాధికారులు, లాయర్లు, వ్యాపారవేత్తలు, చివరకు బాడీగార్డులకు కూడా శాశ్వత సభ్యత్వం ఉంది. సంఘంలోని కొందరు పేరున్న పెద్దలు తమ స్నేహితులను, బంధువులను బినామీలుగా పెట్టి, తమ ఆధిపత్యం చెలాయిస్తున్నారని మాజీ సభ్యుడు సునీల్ సింగ్ ఆరోపించారు. జార్ఖండ్ రాష్ట్రం తరఫున రంజీ మ్యాచ్‌లు ఆడిన ప్రదీప్ ఖన్నా, ఆదిల్ హుస్సేన్ లాంటి వాళ్లకు కూడా క్రికెట్ సంఘంలో సభ్యత్వం లేదు. అయితే, ధోనీ ఇంకా టీమిండియా తరఫున ఆడుతున్నాడు కాబట్టి ఇప్పుడు క్రికెట్ సంఘంలో అతడి సభ్యత్వం గురించిన చర్చ అనవసరమని జేఎస్‌సీఏ అధ్యక్షుడు అమితాబ్ చౌదరి అన్నారు. ధోనీ శాశ్వత సభ్యుడిగా ఉంటే అది సంఘానికే గౌరవం అన్నారు.
మూడు ఐసీసీ ట్రోఫీలు గెలుచుకున్న ఏకైక భారత కెప్టెన్.. ధోనీ. అతడు జార్ఖండ్ రాష్ట్రం నిర్వహించిన మొట్టమొదటి గ్లోబల్ ఇన్వెస్టర్ల్ సదస్సుకు బ్రాండ్ అంబాసిడర్ కూడా. రాష్ట్ర పర్యాటకాన్ని ప్రమోట్ చేయాలని కూడా ప్రభుత్వం ధోనీని కోరింది. అయితే.. ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్ల ధోనీకి వచ్చిన నష్టం ఏమీ లేదని అతడి చిన్ననాటి స్నేహితుడు చిట్టు అన్నారు.