ధోని ఈజ్ బ్యాక్.. పుణే రైజింగ్ విక్టరీ
ధోని ఈజ్ బ్యాక్.. పుణే రైజింగ్ విక్టరీ
Published Sat, Apr 22 2017 7:52 PM | Last Updated on Tue, Sep 5 2017 9:26 AM
► రాణించిన రాహుల్ త్రిపాఠి (59)
పుణే: సన్ రైజర్స్ హైదరాబాద్, రైజింగ్ పుణే ల మధ్య జరిగిన ఉత్కంఠకర మ్యాచ్ లో ధోని విరోచిత బ్యాటింగ్ తో రైజింగ్ పుణే 6 వికెట్ల తేడాతొ విజయం సాధించింది. గత కొద్ది రోజులుగా తనపై విమర్శలు చేస్తున్న విమర్శకులకు ధోని తన బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు. దాదాపు ఓటమి అంచులకు చేరిన జట్టును తన హిట్టింగ్ బ్యాటింగ్ తో విజయాన్ని అందించి మరో మారు మంచి హిట్టరని నిరూపించుకున్నాడు. 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 69 పరుగులు చేసిన ధోని పుణే వరుస పరాజయాలకు బ్రేక్ వేశాడు. ఇక హోం గ్రౌండ్ మ్యాచుల్లో వరుసగా గెలిచి, బయటి గ్రౌండ్ లో ఓడుతున్న సన్ రైజర్స్ కు మరో ఓటమి తప్ప లేదు. చివరి వరకు కట్టు దిట్టంగా బౌలింగ్ చేసిన సన్ రైజర్స్ బౌలర్స్ చివరి ఓవర్లో ధోని బ్యాటింగ్ కు చేతులెత్తెశారు.
177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రైజింగ్ పుణే కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అజింక్యా రహానే (2) వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన పుణే కెప్టెన్ స్మిత్, త్రిపాఠితో కలిసి స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. సిరాజ్ వేసిన 5 ఓవర్ తొలి బంతికి రాహుల్ త్రిపాఠి ఇచ్చిన క్యాచ్ ను బిపుల్ శర్మ మిస్ చేయడంతో సన్ రైజర్స్ తగిన మూల్యం చేల్లించుకుంది. అనంతరం రెచ్చిపోయిన త్రిపాఠి సిరాజ్ బౌలింగ్ లో సిక్స్, ఫోర్ తో చెలరేగి 13 పరుగులు రాబట్టాడు. ఈ దశలో 32 బంతుల్లో త్రిపాఠి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నిలకడగా ఆడుతున్న ఈ జంటను రషీద్ ఖాన్ 11 ఓవర్లో తన అద్భుతమైన బంతితో స్మిత్ ను బోల్డ్ చేశాడు. దీంతో వీరద్దరీ 72 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ధోని సన్ రైజర్స్ బౌలర్స్ కట్టు దిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆచి తూచి ఆడాడు.
ఈ తరుణంలో14 ఓవర్లో రాని పరుగు కోసం ప్రయత్నించిన త్రిపాఠి(59) రషీద్ గుడ్ త్రోకు రనౌట్ అయ్యాడు. వెంటనే బెన్ స్టోక్స్ అవుట్ కావడంతో మ్యాచ్ సన్ రైజర్స్ చేతిలోకి వచ్చింది. చివర్లో సిరాజ్ వేసిన 18 ఓవర్లో ధోని వరుస బంతుల్లో సిక్సర్, ఫోర్ తో విరుచుకుపడటంతో మ్యాచ్ ఉత్కంఠంగా మారింది. భువనేశ్వర్ వేసిన 19 ఓవర్లలో వరుస బంతులను ధోని బౌండరికి తరలించి, సిక్స్ కొట్టడంతో 19 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో పుణే విజయానికి 11 పరుగులు కావల్సి ఉండగా చివరి బంతి వరకు ఉత్కంఠ కొనసాగింది. చివరి బంతిని ధోని బౌండరీకి తరలించడంతో పుణే విజయం సాధించింది.
Advertisement
Advertisement