భారత క్రికెట్ జట్టు (ఫైల్‌ఫొటో)
సిడ్నీ: ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్ గెలవడానికి భారత్‌కు ఇదే మంచి అవకాశమని అంటున్నాడు ఆసీస్ మాజీ క్రికెటర్ ఇయాన్ చాపెల్. జూలైలో భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది.
ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ క్రికెటర్ ఇయాన్ చాపెల్ మాట్లాడుతూ...‘ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ లైనప్ చాలా బాగుంది. బౌలర్లతో పాటు బ్యాట్స్‌మెన్లు ఈ పర్యటనలో మెరుగైన ప్రదర్శన చేస్తే భారత్‌దే విజయం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ గెలిచేందుకు భారత్‌కు ఇదో అరుదైన, మంచి అవకాశం కూడా. ఒత్తిడిని తట్టుకోలేక ఇంగ్లండ్ ఇటీవల లార్డ్స్ వేదికగా పాక్‌తో జరిగిన టెస్టులో ఓడిపోయింది.
ఓపెనర్ కుక్ ఇంగ్లండ్ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇవ్వలేకపోతున్నాడు. దీంతో ఆ జట్టుకు ఈ మధ్య కాలంలో శుభారంభమే దక్కడం లేదు. దీన్ని భారత్ పూర్తిగా సద్వినియోగం చేసుకుంటుందని భావిస్తున్నా. భారత బౌలర్లు ఇంగ్లిష్ మిడిలార్డర్‌ను దెబ్బకొడితే వారు తేరుకోవడం కష్టం’ అని చాపెల్ విశ్లేషించాడు. భారత తన పర్యటనలో ఇంగ్లండ్‌తో టీ20, వన్డే, టెస్టు సిరీస్‌లు ఆడనుంది. జులై 3 నుంచి ఇరు దేశాల మధ్య టీ20 సిరీస్ జరగనుంది. ఆగస్టులో టెస్టు సిరీస్ ప్రారంభంకానుంది.
Comments
Please login to add a commentAdd a comment