
కోల్‌కతా: ప్రపంచ కప్ జట్టులోకి రెండో వికెట్ కీపర్‌గా ఎంపికైన దినేశ్ కార్తీక్... అవసరమైతే ఓపెనింగ్‌తో పాటు ఫినిషర్‌గానూ పనికొస్తాడని అతని మెంటార్ అభిషేక్ నాయర్ వ్యాఖ్యానించాడు. క్రికెట్‌లో ఎప్పుడు ఎవరికి ఎలాంటి అవకాశం వస్తుందో చెప్పలేమన్న నాయర్... ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకునేలా సంసిద్ధమై ఉండాలని అన్నారు. ధోని గాయపడితేనే రెండో వికెట్ కీపర్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందన్న ఎమ్కెస్కే వ్యాఖ్యల నేపథ్యంలో నాయర్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.
‘కార్తీక్ కేవలం వికెట్ కీపింగ్ మాత్రమే కాదు. నంబర్ 4 స్థానంలోనూ ఆడగలడు. అవసరమైతే ఓపెనింగ్ చేయగలడు. ఫినిషర్‌గానూ పనికొస్తాడు. అతన్ని బ్యాకప్‌గానే జట్టులోకి ఎంపిక చేశారు. కానీ ఎవరైనా ఫామ్ కోల్పోతే స్పెషలిస్టు బ్యాట్స్‌మన్ కోసం మేనేజ్‌మెంట్ అతని వైపే చూస్తుందని నా నమ్మకం. ఎప్పుడు అవకాశం వస్తుందో తెలీదు కానీ వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా కార్తీక్ అందిపుచ్చుకోవాలి’ అని నాయర్ అన్నాడు.