
భారత్-ఆస్ట్రేలియా తొలి టెస్టు డౌటే
ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ విషాద మరణం నేపథ్యంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు జరిగేది సందేహంగా మారింది.
బ్రిస్బేన్: ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ విషాద మరణం నేపథ్యంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు జరిగేది సందేహంగా మారింది. ఇరు జట్ల మధ్య బ్రిస్బేన్లో ఈ మ్యాచ్ ఆరంభంకావాల్సివుంది. అయితే హ్యూస్ మరణం తాలుకు విషాద ఛాయల నుంచి తమ ఆటగాళ్లు ఇంకా కోలుకోలేదని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అధికారులు తెలిపారు.
తొలి టెస్టును రద్దు చేస్తే బాగుంటుందని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సూచించారు. ఇదిలావుండగా, హ్యూస్ మృతితో భారత్, క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్ల మధ్య శుక్ర, శని వారాల్లో జరగాల్సిన రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ను రద్దు చేశారు.
మెదడుకు తీవ్ర గాయం కావడంతో రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ (25) గురువారం మరణించిన సంగతి తెలిసిందే. దక్షిణ ఆస్ట్రేలియా-న్యూ సౌత్ వేల్స్‌ల మధ్య జరిగిన దేశవాళీ మ్యాచ్‌లో సీన్ అబాట్ వేసిన బంతి హ్యూస్ మెడను బలంగా తాకడంతో మైదానంలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే సెయింట్ విన్సెంట్ ఆసుపత్రికి తరలించి అత్యవసర శస్త్రచికిత్స చేసినా ప్రయోజనం లేకపోయింది.