టాస్‌కు ఆలస్యంగా వస్తూ ఆటను అవమానిస్తాడని సౌరవ్ గంగూలీని ఇటీవలే విమర్శించిన ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్‌వా... దాదా సొంత నగరానికి వెళ్లి అతడిపై ప్రశంసలు కురిపించారు.
కోల్‌కతా: టాస్‌కు ఆలస్యంగా వస్తూ ఆటను అవమానిస్తాడని సౌరవ్ గంగూలీని ఇటీవలే విమర్శించిన ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్‌వా... దాదా సొంత నగరానికి వెళ్లి అతడిపై ప్రశంసలు కురిపించారు. అతనో అద్భుతమైన క్రికెటర్ అని కొనియాడారు. ‘సౌరవ్ ఒక గొప్ప కెప్టెన్ అని ఈ కోల్‌కతాలో మీకందరికీ తెలుసు. భారత జట్టుకు అతను తెగింపును నేర్పాడు’ అని వా వ్యాఖ్యానించారు.
అయితే ధోనితో పోలిక గురించి ప్రశ్నించగా, ఇద్దరూ భిన్నమైన, చక్కటి కెప్టెన్లని ఆయన చెప్పారు. త్వరలో 200వ టెస్టు ఆడబోతున్న సచిన్‌కు వా అభినందనలు తెలిపారు. అది ఇతరులకు సాధ్యం కాని గొప్ప ఘనత అని కొనియాడారు. మరో వైపు 2001 చెన్నై టెస్టులో జరిగిన బాల్ టాంపరింగ్ వివాదం గురించి ప్రశ్నించగా...తాను గతం గురించి ఆలోచించనని స్పష్టం చేశారు.
డీఆర్‌ఎస్ సరైందే...: వివాదాస్పదంగా మారినా...అంపైర్ సమీక్ష పద్ధతికే తన ఓటు అని స్టీవ్ వా వెల్లడించాడు. ‘ఆసీస్‌కు వ్యతిరేకంగా నిర్ణయాలు వచ్చినా జట్టు వైఫల్యానికి అది కారణం కాదు. డీఆర్‌ఎస్ మంచి పద్ధతి అని గతంలో చాలా సార్లు చెప్పాను. అంపైరింగ్ అంత బలంగా లేదనేది వాస్తవమే అయినా ఎక్కువగా సరైన నిర్ణయాలు తీసుకునేందుకు ఇందులో అవకాశముంది’ అని ఈ దిగ్గజ క్రికెటర్ పేర్కొన్నారు. దానిని వ్యతిరేకించేందుకు భారత్‌కు తగిన కారణమే ఉండొచ్చన్న వా...భవిష్యత్తులో ఆటగాళ్లతో పాటు మీడియా కూడా అంగీకరించే టెక్నాలజీ వచ్చే అవకాశం కూడా ఉందని జోస్యం చెప్పారు.