
స్టోక్స్, బట్లర్, రూట్ విజయానందం
కేప్‌టౌన్: ఈ మ్యాచ్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా గెలవడం కష్టమే... కానీ ‘డ్రా’ చేసుకోవడం మాత్రం కష్టం కాదు. ఆఖరి సెషన్‌లో ఇంకా 13 ఓవర్లు మిగిలుండగా సఫారీ ఏడు వికెట్లను కోల్పోయింది. మిగతా మూడు వికెట్లతో 13 ఓవర్లు ‘డ్రా’మాలాడితే సరిపోయేది. కానీ ఇంగ్లండ్ పేసర్ బెన్ స్టోక్స్ (3/35) వారికి ఆ అవకాశమివ్వలేదు. ఇన్నింగ్స్ 134వ ఓవర్ వేసిన అతను వరుస బంతుల్లో ప్రిటోరియస్ (0), నోర్జే (0)లను డకౌట్ చేశాడు. దీంతో సఫారీ ‘డ్రా’ఆశలు కూలాయి.
ఫిలాండర్ (51 బంతుల్లో 8) రూపంలో ఆఖరి వికెట్ కూడా స్టోక్సే తీయడంతో... దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ 189 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 438 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు మంగళవారం 126/2 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆటకొనసాగించిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 137.4 ఓవర్లలో 248 పరుగుల వద్ద ఆలౌటైంది. చివరి రోజు డికాక్ (50; 7 ఫోర్లు) మినహా ఇంకెవరూ ప్రతిఘటించలేకపోయారు. ఈ గెలుపుతో నాలుగు టెస్టుల సిరీస్‌ను 1–1తో ఇంగ్లండ్ సమం చేసింది. ఈ నెల 16 నుంచి పోర్ట్ ఎలిజబెత్‌లో మూడో టెస్టు జరుగుతుంది.