నాది కూడా అభినవ్‌ వర్ణ వివక్ష స్టోరీనే | Faced Racial Jibes During My Playing Days, Dodda Ganesh | Sakshi
Sakshi News home page

నాది కూడా అభినవ్‌ వర్ణ వివక్ష స్టోరీనే: మాజీ క్రికెటర్‌

Published Wed, Jun 3 2020 3:19 PM | Last Updated on Wed, Jun 3 2020 4:16 PM

Faced Racial Jibes During My Playing Days, Dodda Ganesh - Sakshi

బెంగళూరు: మళ్లీ జాతి వివక్ష అంశం తీవ్రమైంది. అమెరికాలో జార్జ్‌ ఫ్లాయిడ్‌ అనే నల్ల జాతీయుడిని శ్వేత జాతి పోలీస్ అధికారి విచక్షణారహితంగా చంపిన నేపథ్యంలో ఆ దేశంలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. దీనిపై ఇప్పటికే పలువురు క్రీడా దిగ్గజాలు విరుచుకుపడుతుండగా, గతంలో ఎవరైతే ఇలా వర్ణ వివక్షకు గురయ్యారో వారు ముందుకొస్తున్నారు. ఈ కోవలో భారత మాజీ క్రికెటర్‌ దొడ్డా గణేశ్‌తో పాటు తమిళనాడుకు చెందిన టాపార్డర్‌ బ్యాట్స్‌మన్‌ అభివన్‌ ముకుంద్‌లు ఉన్నారు. దీనిపై ముందుగా అభినవ్‌ ముకుంద్‌ తన స్వరం వినిపించగా, అందుకు దొడ్డా గణేశ్‌ మద్దతుగా నిలిచాడు.(‘గుండెలపై చేయి వేసుకొని చెప్పగలరా?’)

‘నేను జాతి వివక్ష బారిన పడ్డా. కొంతమంది నన్ను టార్గెట్‌ చేసి తీవ్ర స్థాయిలో నాపై విమర్శలు చేశారు. నా వర్ణాన్ని కించపరుస్తూ అవహేళన చేశారు. వారిని నియంత‍్రణలో పెట్టడం అనేది మన చేతుల్లో ఉండదు. మనిషి రంగును బట్టి గుణం ఉండదు. అది అందానికి సంబంధించినది కాదు. ఎవరైతే ఇలా వివక్షకు గురయ్యారో వారంతా వారి వారి అనుభవాల్ని షేర్‌ చేసుకుంటే మంచిది’ అని తెలిపాడు. కాగా, ఆ సమయంలో ఎందుకు మాట్లాడలేదని ముకుంద్‌ను జర్నలిస్టు ప్రశ్నించగా, అది సరైన సమయం కాదనే తాను మాట్లాడలేదన్నాడు. 2017 శ్రీలంకతో వారి దేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్‌ మధ్యలో ఉండగా ఆ ఘటన జరిగింది. దాంతో నేనేమీ మాట్లాడలేదు’ అని ముకుంద్‌ పేర్కొన్నాడు. ఈ మేరకు తన ట్వీటర్‌ అకౌంట్‌ ఒక లేఖను సైతం అభినవ్‌ పోస్ట్‌ చేశాడు. తాను క్రికెటర్‌గా చాలా చోట్లకు తిరుగుతూ ఉండేవాడినని, ఈ క్రమంలోనే కొన్ని సందర్భాల్లో వర్ణ వివక్షకు గురైన విషయాన్ని తెలిపాడు.  మనలోని స్వచ్ఛత అనేది రంగును బట్టి ఏమీ ఉండదనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ తెలుసుకుంటే మంచిదనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ విషయాన్ని చెబుతున్నానన్నాడు. ఇకనైనా ఇలా వివక్ష వ్యాఖ్యలు చేసేవారి మైండ్‌ సెట్‌ మారుతుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు. (రవిశాస్త్రి పోస్ట్‌కు రణ్‌వీర్‌ రిప్లై)

నాది కూడా అభినవ్‌ స్టోరీనే
అభివన్‌ ముకుంద్‌ పోస్ట్‌ చేసిన లేఖపై కర్ణాటకకు చెందిన భారత మాజీ పేసర్‌ దొడ్డా గణేశ్‌ స్పందించాడు. తాను కూడా అభినవ్‌ తరహాలోనే వర్ణ వివక్షకు గురైనట్లు తెలిపాడు. ‘అభినవ్‌ స్టోరీ నాకు ఎదురైన అనుభవాన్ని గుర్తు చేసింది. నేను భారత్‌కు ఆడుతున్న సమయంలో ఎక్కువగా వర్ణ వివక్షకు గురయ్యా. దానికి ఒక భారత లెజండరీ క్రికెటరే సాక్ష్యం. ఇలా విమర్శించడం నన్ను ధృఢంగా చేసింది అలాగే దేశానికి ఆడటాన్ని కూడా దూరం చేయలేదు. నిజాయితీగా చెప్పాలంటే 90వ దశకంలో వర్ణ వివక్ష సీరియస్‌నెస్‌ గురించి నాకు పెద్దగా తెలియదు. అప్పుడు మనం ఏమైనా చెప్పుకోవడానికి ఇప్పుడున్నట్లు సోషల్‌ మీడియా లేదు. భవిష్యత్తులో ఏ భారత క్రికెటర్‌ ఇలా వర్ణ వివక్షకు గురి కాడనే ఆశిస్తున్నా’ అని దొడ్డా గణేశ్‌ తెలిపాడు.  భారత్‌ తరఫున నాలుగు టెస్టులు, ఒక వన్డే మ్యాచ్‌ను గణేశ్‌ ఆడాడు. ఇక రంజీ ట్రోఫీ విషయానికొస్తే కర్ణాటక తరఫున 100పైగా మ్యాచ్‌లు ఆడిన గణేశ్‌.. 365 వికెట్లు సాధించాడు. 2007లో తన అంతర్జాతీయ కెరీర్‌కు గణేశ్‌ వీడ్కోలు చెప్పాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement