అది మాకు పెద్ద సవాలే:భువనేశ్వర్
న్యూఢిల్లీ:ఈ ఐపీఎల్ సీజన్లో సంచలన ప్రదర్శనతో ఫైనల్ కు చేరిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరును నిలువరించడం తమ ముందున్న పెద్ద సవాల్ అని సన్ రైజర్స్ హైదరబాద్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అభిప్రాయపడ్డాడు. ప్రత్యేకంగా బెంగళూరు టాపార్డర్ను నియంత్రించగలగడం అంత సులభం కాదన్నాడు. 'రేపటి ఫైనల్ మ్యాచ్లో కచ్చితంగా తగిన వ్యూహ రచనతో సిద్ధం కావాలి. ఈ సీజన్లో ఆర్సీబీ నమోదు చేసిన పరుగుల్లో 35 శాతం విరాట్ కోహ్లినే సాధించాడు. అటు విరాట్ కోహ్లితో పాటు, క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, ఆపై షేన్ వాట్సన్ ఇలా స్టార్ ఆటగాళ్లంతా బెంగళూరు బలం. వీరిని నిలువరించడం కాస్త కష్టమే. మరొక మంచి మ్యాచ్ జరుగుతుందని ఆశిస్తున్నాము. ప్రస్తుతం మా జట్టు సంతోషంగా ఉన్నా, ఒత్తిడితో కూడుకున్న మరొక మ్యాచ్ ముందుంది' అని భువనేశ్వర్ పేర్కొన్నాడు.
ఇదిలా ఉండగా, నిన్నటి కీలక మ్యాచ్లో ముస్తాఫిజుర్ రెహ్మాన్ను ఆడించకపోవడం అంత మంచి నిర్ణయం కాదని భువీ తెలిపాడు. అతని స్థానంలో ట్రెంట్ బౌల్ట్ కు అవకాశం ఇచ్చినా, ముస్తాఫిజుర్ను తప్పించడం సరైన నిర్ణయం ఎంతమాత్రం కాదన్నాడు. శుక్రవారం జరిగిన రెండో క్వాలిఫయర్ లో గుజరాత్ లయన్స్పై విజయం సాధించడంతో సన్ రైజర్స్ ఫైనల్ కు చేరింది. ఆదివారం ఆర్సీబీ-హైదరాబాద్ జట్ల మధ్య చిన్నస్వామి స్టేడియంలో తుది సమరం జరుగనుంది.