కోహ్లీని కవ్విస్తున్న మాక్స్‌వెల్
రాంచీ: బెంగళూరు టెస్టులో తమ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన తీవ్ర వ్యాఖ్యలను ఆస్ట్రేలియా ఆటగాళ్లు తేలికగా తీసుకున్నట్లు కనిపించడం లేదు. తొలిరోజు గాయపడ్డ సందర్భంగా కోహ్లీ బాధపడ్డట్లుగా మూడోరోజు ఏ గాయం అవకుండా అదే రీతిన భుజాన్ని పట్టుకుని మాక్స్‌వెల్ కనిపించాడు. దీంతో స్డేడియంలో ఒక్కసారిగా అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. విషయం ఏంటంటే.. మూడో టెస్టు రాంచీలో తొలిరోజు ఆటలో రవీంద్ర జడేజా వేసిన బాల్‌ను పీటర్ హాండ్స్‌కూంబ్ వైడ్ మిడాన్‌వైపు పుష్ చేయగా, కోహ్లీ దాన్ని వెంబడించాడు.
బంతిని ఆపేందుకు డైవ్ చేయగా, ఆ సమయంలో కోహ్లీ కుడివైపు భుజం నేలకు తాకింది. దాంతో బాధతో విలవిల్లాడిపోయాడు. కొంత సమయం భుజాన్ని అలాగే పట్టుకుని మైదానంలో ఉండిపోయాడు. ఆపై ఫీల్డ్ నుంచి విశ్రాంతి కోసం వెళ్లిపోయాడు. సరిగ్గా మూడో రోజు ఆటలో ఆసీస్ ప్లేయర్ గ్లెన్ మాక్స్‌వెల్ విరాట్ కోహ్లీని అనుకరిస్తూ ఎగతాళి చేశాడు. పుజారా ఆడిన బంతిని ఆపే ప్రయత్నంలో మాక్స్‌వెల్.. కోహ్లీ డైవ్ చేసిన ప్రదేశంలోనే డైవ్ చేసి బంతిని ఆపాడు. లేచిన తర్వాత ఈ టెస్టు తొలిరోజు కోహ్లీ పట్టుకున్నట్లుగా భుజాన్ని పట్టుకుని కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు. దీంతో ప్రేక్షకులు 'మాక్స్‌వెల్ దిస్ ఈజ్ నాట్ వెల్' అంటూ గట్టిగా అరవడం గమనార్హం.