
సిబుల్కోవా అవుట్
పురుషుల డబుల్స్‌లో ముగిసిన భారత్ పోరు ∙వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ
లండన్: టెన్నిస్ సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ వింబుల్డన్‌లో శుక్రవారం రెండు సంచలనాలు నమోదయ్యాయి. మహిళల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్ సిబుల్కోవా (స్లొవేకియా)... పురుషుల సింగిల్స్‌లో తొమ్మిదో సీడ్ కీ నిషికోరి (జపాన్) మూడో రౌండ్‌లో ఇంటిదారి పట్టారు. సిబుల్కోవా 6–7 (3/7), 6–3, 4–6తో 27వ సీడ్ అనా కొంజూ (క్రొయేషియా) చేతిలో... నిషికోరి 4–6, 6–7 (3/7), 6–3, 3–6తో 18వ సీడ్ బాటిస్టా అగుట్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయారు.
ప్రిక్వార్టర్స్‌లో నాదల్
పురుషుల సింగిల్స్‌లో నాలుగో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), ఏడో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మూడో రౌండ్‌లో నాదల్ 6–1, 6–4, 7–6 (7/3)తో 30వ సీడ్ ఖచనోవ్ (రష్యా)పై, సిలిచ్ 6–4, 7–6 (7/3), 6–4తో 26వ సీడ్ జాన్సన్ (అమెరికా)పై నెగ్గారు. గురువారం ఆలస్యంగా ముగిసిన రెండో రౌండ్ మ్యాచ్‌లో మూడో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 7–6 (7/0), 6–3, 6–2తో లాజోవిక్ (సెర్బియా)పై గెలిచాడు.
హలెప్ ముందంజ
మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) 6–4, 7–6 (9/7)తో షుయె పెంగ్ (చైనా)పై, నాలుగో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–1, 7–5తో వితోయిఫ్ట్ (జర్మనీ)పై, ఆరో సీడ్ జొహానా కొంటా (బ్రిటన్) 6–4, 6–1తో సకారి (గ్రీస్)పై, ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, 13వ సీడ్ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా) 7–5, 7–5తో కామిల్లా గియోర్గి (ఇటలీ)పై, మాజీ నంబర్‌వన్ అజరెంకా (బెలారస్) 3–6, 6–1, 6–4తో హీతెర్ వాట్సన్ (బ్రిటన్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు.
పోరాడి ఓడిన శరణ్ జంట
పురుషుల డబుల్స్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. రెండో రౌండ్‌లో దివిజ్ శరణ్–పురవ్ రాజా ద్వయం 3 గంటల 31 నిమిషాల్లో 3–6, 4–6, 6–4, 7–6 (8/6), 8–10తో ఏడో సీడ్ రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా)–రాజీవ్ రామ్ (అమెరికా) జోడీ చేతిలో ఓడింది. రోహన్ బోపన్న (భారత్)–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జోడీ 6–7 (6/8), 3–6, 7–6 (7/5), 3–6తో కెన్ స్కప్‌స్కీ–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) జంట చేతిలో పరాజయం పాలైంది. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో లియాండర్ పేస్ (భారత్)–యిఫాన్ జు (చైనా) జోడీ 7–5, 3–6, 2–6తో ఫాబ్రిస్ మార్టిన్ (ఫ్రాన్స్)–రలూకా ఒలారూ (రొమేనియా) జంట చేతిలో ఓటమి చవిచూసింది.