
100కు పైగా బంతులు.. 6 పరుగులు
టీమిండియాతో జరుగుతున్న నాల్గో టెస్టులో 481 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటింగ్ కు దిగిన సఫారీలు డ్రా కోసం ఆడుతున్నట్లు కనిపిస్తున్నారు.
ఢిల్లీ:టీమిండియాతో జరుగుతున్న నాల్గో టెస్టులో 481 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటింగ్ కు దిగిన సఫారీలు డ్రా కోసం ఆడుతున్నట్లు కనిపిస్తున్నారు. నాల్గో రోజు ఆటలో భాగంగా ఆదివారం రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన సఫారీలు ఆదిలో ఎల్గర్(4) వికెట్ కోల్పోయి తడబడినట్లు కనిపించినా.. ఆ తరువాత హషీమ్ ఆమ్లా(6 బ్యాటింగ్), భావుమా(28 బ్యాటింగ్) జోడి ఆచితూచి బ్యాటింగ్ చేయడంతో కుదుటపడింది. భావుమా చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తున్నా.. ఆమ్లా మాత్రం వికెట్లు ముందు గోడలా పాతుకుపోయాడు. 113 బంతులను ఎదుర్కొన్న ఆమ్లా కేవలం ఆరు పరుగులను మాత్రమే చేశాడు. దీంతో సఫారీలు టీ విరామానికి 39.0 ఓవర్లలో వికెట్ నష్టానికి 40 పరుగులు చేశారు.
అంతకుముందు 190/4 ఓవర్ నైట్ స్కోరుతో నాల్గో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా 100.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసిన అనంతరం డిక్లేర్ చేసింది. ఈ రోజు ఆటలో విరాట్ కోహ్లి(88) సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయినా.. అజింక్యా రహానే మరో శతకాన్ని సాధించాడు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసి సఫారీలకు చుక్కలు చూపించిన రహానే.. రెండో ఇన్నింగ్స్ లో కూడా అదే తరహాలో బ్యాటింగ్ చేసి మరో సెంచరీతో ఆకట్టుకున్నాడు. రహానే సెంచరీ చేసిన పిదప టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.