
న్యూఢిల్లీ: 26/11 ఉగ్రదాడి చెన్నై వేదికగా 2008లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్ గెలిచేలా కసిని పెంచిందని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆనాటి రోజులను గుర్తుకు తెచ్చుకున్నారు. ఈ ఉగ్రదాడి జరిగి 9 ఏళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో సచిన్ ఆనాటి పరిస్థితులపై ఉద్వేగంగా ప్రసంగించారు.
ఆసమయంలో టెస్టు మ్యాచ్ ఆడుతున్నాం..
‘ముంబై 26/11 ఉగ్రదాడి జరిగినప్పుడు కటక్ వేదికగా ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాం. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్ న్యూస్ చానళ్లో ఈ వార్తను చూశాం. తొలుత చానళ్లన్నీ ముంబై గ్యాంగ్ వార్ దాడి అని ప్రసారం చేశాయి. ఇది ఉగ్రదాడి అని ఎవరం ఊహించలేకపోయాం. హోటల్‌కు చేరగానే ఈ వార్త పూర్తిగా మారిపోయింది. అన్నీ న్యూస్ చానెళ్లు తాజ్ హోటల్, ట్రిడెంట్ హోటళ్లను పదే పదే చూపిస్తూ గ్యాంగ్‌వార్ అనే పదాన్ని తొలగించాయి. ఉగ్రదాడని తెలిసిన ఆ క్షణం మేమంతా షాక్‌కు గురయ్యాం. ఆ రోజు నిద్రలేని రాత్రి గడిపాం.
ఆ విజయం మరిచిపోలేనిది..
ఆ తరువాతి రోజే ఇంగ్లండ్ జట్టు పర్యటనను రద్దు చేసుకునే యోచనలో ఉన్నట్లు తెలిసింది. మేము కూడా ముంబై తిరుగు పయనం అయ్యాం. సరిగ్గా 10 రోజుల తర్వాత షెడ్యూల్‌ను చెన్నైకి మార్చడంతో పర్యటనను కొనసాగించడానికి ఇంగ్లండ్ అంగీకరించింది. మా ఆలోచనలన్నీ ఈ దిగ్భ్రాంతికర ఘటన చుట్టూ తిరుగుతున్నాయి. ఆటపై దృష్టి సారించలేని పరిస్థితి ఏర్పడింది. మ్యాచ్ మొదలైన తొలి మూడు రోజులు ఇంగ్లండ్ మాకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. దేశం కోసం ఏదో ఒకటి చేయాలని మేమందరం గట్టిగా నిర్ణయించుకున్నాం. అనంతరం నాలుగో రోజు ఆటలో పరిస్థితులు మాకు అనుకూలించాయి. ఆటగాళ్ల సమిష్టి ప్రదర్శనతో మ్యాచ్ గెలిచాం. ఈ గెలుపు అనంతరం మేమంతా ఉద్వేగానికి లోనయ్యాం. తొలిసారి గ్రౌండ్ సిబ్బంది మైదానంలోకి వచ్చి సంబరాలు చేసుకుంటూ మమ్మల్ని అభినందించారు. ఆ క్షణం నా జీవితంలో మరిచిపోలేనిది.
సైనికులారా.. సెల్యూట్
భారత జట్టులో వేర్వేరు మతాలు, కులాలకు చెందిన వారుంటారు. కానీ అందరూ దేశం కోసమే ఆడతారు. దేశం కోసం ఆడాలనే ఈ భావన ఎన్నటికి చెరగదు. దేశ రక్షణ కోసం అహర్నిశులు కష్టపడుతున్న భారత సైనికులే మనందరికి ఈ స్పూర్తిని కలిగించారు. సైనికులురా.. మీ సేవలకు నా సెల్యూట్’ అని సచిన్ ఉద్వేగానికి లోనయ్యారు.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 387 పరుగుల లక్ష్యాన్ని విధించింది. సచిన్, యువరాజ్‌లు పోరాటంతో భారత్ విజయం సాధించింది.